Meenakshi Tension: కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి టెన్షన్..!! గీత దాటితే దబిడి దిబిడే..!!

కాంగ్రెస్ పార్టీలో (congress party) క్రమ శిక్షణ అనగానే నవ్వొస్తుంటుంది. ఆ పార్టీలో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థం చేసుకోవడం కష్టం. ఆ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువని, ఎవరు ఎలా మాట్లాడినా పట్టించుకునే వాళ్లుండరని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఆ పార్టీ నేతలు కూడా పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇక్కడ కూడా అలా గీత దాటే నేతలెంతో మంది ఉన్నారు. అయితే ఇప్పుడు అలాంటి నేతలందరూ వణికిపోతున్నారు. ఇందుకు కారణం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan).
మీనాక్షి నటరాజన్ కొత్తగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ (Telangana Congress Incharge) గా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా కూడా ఆమె పని చేశారు. ఇప్పుడు ఆమె బాధ్యతలు చేపట్టగానే యాక్షన్ లోకి దిగిపోయారు. సహజంగా పార్టీ ఇన్ ఛార్జ్ లు హంగామా చేస్తుంటారు. వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు స్థానిక నేతలు హడావుడి చేస్తూ వాళ్ల కళ్ళలో పడేందుకు తాపత్రయ పడుతుంటారు. అయితే మీనాక్షి నటరాజన్ మాత్రం విమానంలో కాకుండా రైల్లో హైదరాబాద్ వచ్చారు. సాదాసీదాగా ఎలాంటి హడావుడి లేకుండా ల్యాండ్ అయ్యారు.
నేరుగా గాంధీ భవన్ (Gandhi Bhavan) వెళ్లిన మీనాక్షి నటరాజన్ అక్కడి హోర్డింగులు, బ్యానర్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి వల్ల ఓట్లు రాలవన్నారు. అంతేకాదు.. బొకేలు, కండువాలు లాంటివి తనకు అవసరం లేదని.. వాటిని తీసుకురావద్దని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని తెలిసి వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. మల్లన్న వ్యవహారాన్ని ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చింది పార్టీ హైకమాండ్. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మల్లన్నపై వేటు వేశారు.
తాజాగా పార్టీ సీనియర్ నాయకులు వీహెచ్ (VH) పైన కూడా మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనపై చర్చించేందుకు వీహెచ్ తన నివాసంలో పలు పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఇది మీనాక్షి నటరాజన్ వరకూ చేరింది. దీనిపై వీహెచ్ నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా పీసీసీని (PCC) ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ఇది అందరినీ కంగు తినిపించింది. వీహెచ్ లాంటి సీనియర్ నేత నుంచి కూడా వివరణ కోరడంపై ఆశ్చర్యపోతున్నారు. దీన్ని బట్టి తనకు పార్టీ తప్ప మరొకటి అవసరం లేదని., ఎంతటివారైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదనే హెచ్చరికలను పంపుతున్నారు మీనాక్షి నటరాజన్. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వణికిపోతున్నారు.