Raghunandan Rao:పదేళ్ల పాలనలో గజ్వేల్ కు ఎన్ని నిధులు.. పాలమూరుకు ఎన్ని ఇచ్చారు?
పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు (Palamuru Project)ను ఎందుకు పూర్తి చేయలేకపోయారో కేసీఆర్ (KCR) ప్రజలకు సమాధానం చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. మెదక్‌లో నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభలో రఘునందన్‌రావు మాట్లాడారు. కొడుకు, అల్లుడి పనైపోయిందని, రెండేళ్ల పాటు ఫాంహౌస్ నుంచి బయటకు రాని సారు ఇప్పుడు జిల్లాలు తిరుగుతారంట అని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ (Mahbubnagar MP)గా ప్రజలు గెలిపిస్తే కేసీఆర్ ఐదేళ్లలో ఐదుసార్లు కూడా పాలమూరుకు పోలేదని విమర్శించారు. పార్లమెంట్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల గురించి ఏనాడూ ప్రస్తావించని కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో గజ్వేల్‌కు ఎన్ని నిధులిచ్చారు. పాలమూరుకు ఎన్ని ఇచ్చారో చెప్పిన తర్వాతే పాలమూరు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కేంద్రంపై, బీజేపీపై నెపం నెట్టడం కేసీఆర్ నైజమని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, అబద్ధాలలతో వారిని మరోసారి మభ్యపెట్టలేరన్నారు. ఇంకోసారి బీజేపీని గానీ, ప్రధాని మోదీని గానీ విమర్శిస్తే కేసీఆర్‌కు ఫామ్ హౌస్ లో ఉండడానికి స్థలం కూడా లేకుండా చేస్తామని హెచ్చరించారు.






