Ramachandra Rao: ఇదేనా తెలంగాణ రైతులపై మీ చిత్తశుద్ధి? : రాంచందర్‌రావు
తెలంగాణ రైతుల ప్రయోజనాలపై మీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకే అంగీకరిస్తూ ఎందుకు సంతకం చేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను(KCR) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు (N. Ramachandra Rao) ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ నీటిని, తెలంగాణ సెంటిమెంట్‌ను రాజకీయ ఆయుధంగా వాడుకున్నారని విమర్శించారు. ఓడిపోయి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సెంటిమెంట్ ముగిసిపోతుందని, అందుకే ఆ ప్రాజెక్టును సెంటిమెంట్ ట్రంప్ కార్డు (trump card)లా పెండింగ్‌లో ఉంచుతామని బీఆర్ఎస్ నాయకులు గతంలో ఒక సమావేశంలో స్పష్టం చేశారు. ఆ సమావేశానికి ఎమ్మెల్సీ హోదాలో నేను హాజరయ్యానని చెప్పారు. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా వాదించకపోవడం, బీఆర్ఎస్ విధానాల వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, బలం చూసి కేసీఆర్ బయటకొచ్చారన్నారు. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీజేపీ (BJP)పై, కేంద్రంపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావంతో కేంద్రం ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను తిరస్కరించిందన్న కేసీఆర్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.






