ఫాక్స్‌కాన్ కు మంత్రి కేటీఆర్ భూమిపూజ
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫాక్స్‌కాన్ తమ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడిరట్లో ఒక ఉద్యోగం మనదే. మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఒప్పందం ప్రకారం రెండున్నర నెలల్లోనే ఫాక్స్‌కాన్ పరిశ్రమకు సంబంధించిన శంకుస్థాపన పూర్తి చేశాం. సంస్థకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఏడాదిలోగా ఫాక్స్‌కాన్ పరిశ్రమ పూర్తి కావాలని కోరుకుంటున్నాం. ఈ కంపెనీలో మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు లభిస్తాయి. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ పాల్గొన్నారు. కొంగరకలాన్‌లో రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ నిర్మాణం పూర్తయితే సుమారు 35 వేల మందికి పైగా స్థానికులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు.






