KTR: పాదయాత్ర అక్కడి నుంచేనా…? కేటిఆర్ టార్గెట్ ఏంటీ…?

తెలంగాణలో కేటీఆర్(KTR) పాదయాత్ర చేస్తానంటూ.. చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. గులాబీ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు ప్రజా సమస్యలను భుజానికి ఎత్తుకున్న కేటీఆర్.. ఈ మధ్యకాలంలో మళ్లీ దూకుడు పెంచారు. మొన్నామధ్య కాస్త కేసులు భయంతో సైలెంట్ అయిన కేటిఆర్… ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సూర్యాపేటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇక తాను పాదయాత్ర చేయబోతున్నానని, బీఆర్ఎస్(BRS) పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే.. తన ప్రధాన లక్ష్యం అంటూ ఆయన మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీపై ఫీనిక్స్ పక్షిలా పోరాడుతున్నారని… వాళ్ళందరికీ తాను అండగా ఉంటానంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇక కేటీఆర్ పాదయాత్ర అంటూ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది. ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టబోతున్నారు అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రతో ప్రజల్లోకి బలంగా వెళ్లారు. ఆ పాదయాత్ర కారణంగానే ఆయన అధికారంలోకి వచ్చారు. ఇక ఇప్పుడు కేటీఆర్ కూడా తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుడితే మాత్రం… అది సంచలనం కానుంది. ఇక క్షేత్రస్థాయిలో కూడా కేటీఆర్ కు ఈ పాదయాత్ర కచ్చితంగా లాభం చేకూర్చే అవకాశాలు కూడా ఉంటాయి. సెంటిమెంట్ ప్రకారం పాదయాత్ర చేసిన నాయకులు దాదాపుగా అధికారంలోకి వచ్చారు. దీనితో కేటీఆర్ పాదయాత్ర పై గట్టిగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఏడాదిలోపు మొదలుపెట్టబోయే పాదయాత్ర దాదాపుగా… జగిత్యాల నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలపైనే ఆ పార్టీ ఫోకస్ పెట్టే అవకాశం ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో అలాగే టిడిపి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ దృష్టి పెట్టె అవకాశాలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక కేటీఆర్ పాదయాత్ర చేస్తే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కూడా కచ్చితంగా ధైర్యం వస్తుంది.