KCR: అసెంబ్లీకి సారొస్తున్నారట..! కానీ….!!!

తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. బీఆర్ఎస్ (BRS) ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ (KCR) ఉన్నారు. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు (Telangana Assembly Sessions) హాజరు కావట్లేదు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. అక్కడే నేతలతో సమావేశమవుతున్నారు. పూర్తిగా రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఏదైనా ఇష్యూ జరిగినా కూడా కేసీఆర్ స్పందించట్లేదు. దీంతో అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పదేపదే కోరుతున్నారు. బహుశా వాళ్ల మాట విన్నారో ఏమో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget Sessions) ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు గవర్నర్ ప్రసంగం (governor Speech) ఉంటుంది. 19న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 29వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. తొలిరోజు గవర్నర్ సమావేశానికి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారని ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) వెల్లడించారు. అంతేకాక బడ్జెట్ సమావేశం రోజు కూడా హాజరవుతారని చెప్పారు. ఆ తర్వాత బడ్జెట్ పై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొంటారా లేదా ఆనేది ఆయన ఇష్టమన్నారు. అయితే ఓ కుమారుడిగా, ఆయన అభిమానిగా ఈ సమావేశాలకు హాజరు కావద్దని కోరుతున్నట్టు కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్ స్థాయి ముందు కాంగ్రెస్ నేతలు పనికరారనేది కేటీఆర్ చెప్తున్న మాట. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన సూచిస్తున్నారు. మరి ఆయన మాట మేరకు గవర్నర్ ప్రసంగం రోజు, బడ్జెట్ ప్రసంగం రోజు మాత్రమే వచ్చి ఆ తర్వాత గైర్హాజరు అవుతారా.. లేకుంటే కంటిన్యూగా వస్తారా అనేది తెలీదు. ఏదేమైనా ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతుండడం బీఆర్ఎస్ శ్రేణులకు ఊపిరి పోస్తోంది. కాంగ్రెస్ నేతలు పదే పదే కేసీఆర్ సభకు హాజరు కావాలని డిమాండ్ చేస్తూ ఉండడంతో ఈసారి సార్ సభలో అడుగు పెడితే అలాంటి వాళ్లంతా నోరు మూసుకుంటారని బీఆర్ఎస్ కేడర్ భావిస్తోంది.
అయితే కేసీఆర్ వైఫల్యాలను ఆయన ముందే ఎండగట్టాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అయితేనే సభ రంజుగా సాగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పదేళ్లలో సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చేశారని.. ఇందుకు కేసీఆరే కారణమని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ సభకు హాజరైతే సవివరంగా ఈ అంశాలన్నీ సభ ముందు పెట్టి కడిగి పారేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగం రోజు కేసీఆర్ హాజరైతే ఆయన మాట్లాడేందుకు అవకాశం ఉండదు. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరిగే రోజుల్లో కేసీఆర్ వస్తేనే అది సాధ్యమవుతుంది. మరి ఆయన వస్తారా.. రారా.. అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు.