Kcr: కూటమి వల్లే చంద్రబాబు గెలిచాడు

గత కొన్నాళ్ళుగా బయటకు రాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్(KCR).. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శల వేడిని క్రమంగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్న కేసీఆర్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పార్టీ మారిన నాయకులతో పాటుగా ఏపీ రాజకీయాలపై కూడా మాట్లాడారు. ఎర్రవల్లి ఫాం హౌస్ లో పార్టీ నేతలతో ఆయన సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… రాబోయే రోజుల్లో అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేసారు. సింగిల్ గా అధికారంలో వస్తాం అని ఆశాభావం వ్యక్తం చేసారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని.. అలానే సిరిసంపదలు ఉన్న తెలంగాణాని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవని ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందన్నారు.
ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదన్నారు కేసీఆర్. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ (BRS) మాత్రమే అన్నారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అని మండిపడ్డారు. తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదని సంచలన కామెంట్స్ చేసారు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారన్నారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదని అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలన్నారు.