KCR: కెసిఆర్ మళ్ళీ రిస్క్ చేస్తున్నారా…?

2023 ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఓటమికి కారణాలు ఏంటి అంటే.. చాలామంది చెప్పే మాట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కూడా అని అంటూ ఉంటారు. 2014లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపిని లేకుండా చేసి టిడిపి నాయకులను ఆ పార్టీ క్యాడర్ను తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న చాలామంది నాయకులు టిడిపి నుంచి వెళ్లిన వాళ్లే. ఇక గులాబీ పార్టీ కార్యకర్తల్లో కూడా చాలామంది టిడిపి అభిమానులు ఉన్నారు.
చంద్రబాబు అరెస్టయిన సమయంలో కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నిరసనలపై అలాగే అరెస్టు తర్వాత కామెడీ షో అంటూ చేసిన ఒక ట్వీట్ పై టీడీపీ కార్యకర్తలు అలాగే అభిమానులు మండిపడ్డారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో కూడా వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో మౌనంగా ఉండాల్సిన భారత రాష్ట్ర సమితి అనవసరంగా ఈ విషయాన్ని గెలికింది అనే అభిప్రాయం ఎక్కువగా వినపడింది. అలా ఆ అంశంలో ఇబ్బందిపడిన బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు మళ్లీ టీడీపీ పై విమర్శలు చేసేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో సైతం సంచలనంగా మారాయి. దీనిపై టిడిపి నేతలు కేసీఆర్ పై నేరుగానే విమర్శలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం ఈ విమర్శలపై ఆ పార్టీ క్యాడర్ దుమ్మెత్తి పోస్తోంది. ఇప్పటికే టిడిపి విషయంలో భారత రాష్ట్ర సమితి ఇబ్బంది పడిందని అనవసరంగా మళ్ళీ టిడిపి క్యాడర్ను కదిలిస్తే బిజెపి టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది బిఆర్ఎస్ అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. లేనిపోని సమస్యలు అనవసర వ్యాఖ్యలతో తెచ్చుకోవద్దని ఆ పార్టీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా టిడిపిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది.