KCR – Chandrababu: చంద్రబాబును చూసి కేసీఆర్ అందుకే భయపడుతున్నారా..?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) రాజకీయ జీవితంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కష్ట సమయాల్లో సెంటిమెంట్ కార్డును ఉపయోగించి ప్రజల మద్దతు సంపాదించడంలో దిట్ట. ఈ ఆరోపణ ఆయనపై చాలాకాలంగా వస్తోంది. తాజాగా, ఎర్రవెల్లి ఫాంహౌస్ లో జరిగిన BRS సమావేశంలో KCR చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరోసారి బలం చేకూర్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును (Chandrababu) ఉద్దేశించి “పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు అసందర్భం. కానీ దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
కేసీఆర్ రాజకీయ జీవితం చూస్తే, ఆయన తన ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని, వారిని బూచిగా చిత్రీకరించడం ద్వారా తన రాజకీయ ఎత్తుగడలను సాగిస్తుంటారు. తెలంగాణ ఉద్యమ (Telangana Movement) సమయంలో సీమాంధ్ర (Seemandhra) నాయకులను లక్ష్యంగా చేసుకుని, ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించిన విధానం దీనికి ఒక ఉదాహరణ. ఇప్పుడు తెలంగాణలో BRS అధికారం కోల్పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ తన పాత వ్యూహాన్ని బయటకు తీసినట్లు కనిపిస్తోంది. చంద్రబాబును విమర్శించడం ద్వారా ఆయన తెలంగాణలో తన పార్టీ స్థితిని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (TTDP) గతంలో బలంగా ఉండేది. అయితే 2014 తర్వాత ఆ పార్టీ ప్రభావం క్షీణించింది. అయినా, కేసీఆర్ మాత్రం ఇప్పటికీ చంద్రబాబు పేరును పదేపదే ప్రస్తావించడం వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో NDA కూటమి నాయకుడిగా బలమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయనను టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ తన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు, తెలంగాణ ప్రజల్లో చంద్రబాబు పట్ల ఉన్న పాత వ్యతిరేకతను రగిలించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. కేసీఆర్ తాజా వ్యాఖ్యల్లో “మళ్లీ మనదే అధికారం” అని చెప్పడం ద్వారా, తెలంగాణలో తన పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబును ప్రస్తావించడం వెనుక కారణాలున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ పనిపోయిందని BRS భావిస్తోంది. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం ఆ పార్టీకి పెద్ద ప్లస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా బీజేపీ (BJP), టీడీపీ, జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో సీమాంధ్రులు బీఆర్ఎస్ కు అండగా నిలిచారు. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఇప్పుడు పోటీ చేస్తే సీమాంధ్రుల మద్దతు NDA కూటమికి మళ్లుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే చంద్రబాబును బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే చంద్రబాబును లాగడం ద్వారా కేసీఆర్ రెండు పక్షాల మధ్య దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఇది ఆయనకు తాత్కాలిక లబ్ధిని ఇచ్చినా దీర్ఘకాలంలో ఈ వ్యూహం ఎంతవరకు సఫలమవుతుందనేది ప్రశ్నార్థకం. చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అటువంటి సమయంలో ఆయనను విమర్శించడం కేసీఆర్‌కు బూమరాంగ్‌గా మారే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తంగా కేసీఆర్ చంద్రబాబును బూచిగా చూపడం రాజకీయ ఆటగా కనిపిస్తోంది. ఇది ఆయన పార్టీ స్థితిని బలోపేతం చేయడానికి ఉపయోగపడవచ్చు. కానీ దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారన్నదే కీలకం.