KCR : కేసీఆర్ మరోసారి సెంటిమెంటును రగిలించబోతున్నారా..?

ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుకోవడం ద్వారానే రాజకీయాల్లో మనుగడ సాగించగలరు. ఈ విషయాన్ని బాగా పసిగట్టిన వాళ్లే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండగలుగుతున్నారు. ఇలాంటి వాళ్లలో బీఆర్ఎస్ (BRs) అధినేత కేసీఆర్ (KCR) ముందుంటారు. సెంటిమెంట్లను రగిలించడం, దాన్ని సొమ్ము చేసుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుదేశం (TDP) పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆయన.. ఆ తర్వాత తెలంగాణ సెంటిమెంటును (Telangana sentiment) రగిలించడం ద్వారా ఏ స్థాయికి ఎదిగారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఓడిపోయి ఫాంహౌస్ (KCR Farm House) కు పరిమితమైన ఆయన మరోసారి సెంటిమెంటును అస్త్రంగా చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంకోసం ఆ పార్టీకి రాజీనామా చేసారు కేసీఆర్. ఆ తర్వాత టీఆర్ఎస్ (TRS) పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఈ క్రమంలో ఈయన ఆంధ్రా పాలకుల మీద, ఆంధ్రా (Andhra) సంస్కృతి సంప్రదాయాల మీద చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపోయా అందరికీ తెలుసు. కేసీఆర్ మాటల వల్లే రెండు ప్రాంతాల మధ్య విద్వేషపూరిత వాతావరణం నెలకొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రాంతాల మధ్య ఇప్పుడిప్పుడే వాతావరణం కుదుటపడుతోంది. రెండు రాష్ట్రాల ప్రజలూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటున్నారు. రెండు రాష్ట్రాలూ ఎదగాలని కోరుకుంటున్నారు.
అయితే ఇప్పుడు కేసీఆర్ మళ్లీ సెంటిమెంటుతో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అప్పటి నుంచి కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. తెలంగాణలో ఎంతటి విపత్తులు జరిగినా ఆయన స్పందించలేదు. ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. కనీసం అసెంబ్లీకి రావాలని అధికారపక్షం కోరుతున్నా ఆయన రావట్లేదు. కానీ పార్టీ సర్వసభ్య సమావేశానికి బీఆర్ఎస్ భవన్ కు వచ్చారు కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఆయన మరోసారి రాజకీయ మనుగడకోసం ఆంధ్రా – తెలంగాణ సెంటిమెంటును వాడుకోవాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది.
ఎన్డీయే (NDA) మాటున చంద్రబాబు (Chandrababu) మరోసారి తెలంగాణలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి వాళ్లను ఆదిలోనే అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వాస్తవానికి టీఆర్ఎస్ పేరు మార్చేసి బీఆర్ఎస్ పేరుతో దేశమంతా పోటీ చేయాలనుకున్నారు కేసీఆర్. కానీ చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే మాత్రం అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారు. దీన్ని బట్టి కేసీఆర్ వ్యూహం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మీరు ఆంధ్రాలో పోటీ చేయాలనుకుంటే తప్పు లేదు కానీ చంద్రబాబు తెలంగాణలో పోటీ చేస్తే తప్పా అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ సెంటిమెంట్ మాటలను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి.