Lakshmi Parvathi: హైకోర్టులో లక్ష్మీ పార్వతికి గట్టి షాక్..!!

బసవతారకం మెడికల్ ట్రస్ట్ (Basavatarakam Medical Trust) వ్యవహారంలో లక్ష్మీ పార్వతికి (Lakshmi Parvatahi) ఎదురుదెబ్బ తగిలింది. లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ కోర్టులలో విచారణలో ఉంది. ఎన్టీఆర్ (NTR) రాసినట్లు చెప్తున్న వీలునామా (Will) చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. ఆ వీలునామాలో తనను బసవతారకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నియమించినట్లు లక్ష్మీపార్వతి వాదించింది. అయితే, ఈ వీలునామా ప్రామాణికతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా బాలకృష్ణ ఈ వీలునామాను తీవ్రంగా వ్యతిరేకించారు.
బసవతారకం మెడికల్ ట్రస్ట్ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను (basavatarakam indo American cancer hospital and research institute) నిర్వహిస్తుంది. ఈ ట్రస్ట్ ను ఎన్టీఆర్ తన మొదటి భార్య బసవతారకం పేరుతో స్థాపించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన ఆస్తులు, ట్రస్ట్ నిర్వహణపై వివాదాలు తలెత్తాయి. 1995లో ఎన్టీఆర్ రాసినట్లు చెప్పిన ఒక వీలునామా ఆధారంగా లక్ష్మీపార్వతి తానే మేనేజింగ్ ట్రస్టీ (Managing Trustee) అని వెల్లడించింది. తన వాదనను బలపరుస్తూ 1995 వీలునామాను ఆమె సమర్పించింది. ఈ పత్రానికి సాక్షులుగా ఉన్న జె.వెంకట సుబ్బయ్య, వై.తిరుపతి రావు ఇద్దరూ మరణించారు. ఈ సాక్షుల మరణం వల్ల వీలునామా ధృవీకరణ కష్టతరమైంది. లక్ష్మీపార్వతి తరపున సాక్షి జె.వెంకటసుబ్బయ్య కుమారుడైన జె.వి.ప్రసాద్ రావు ద్వారా ఈ వీలునామాను ధృవీకరించే ప్రయత్నం జరిగింది. కానీ బాలకృష్ణ, ట్రస్ట్ తరపు న్యాయవాదులు దీన్ని వ్యతిరేకంగించారు. ప్రసాద్ రావు అసలు సాక్షి కాదని అతని సాక్ష్యం చట్టబద్ధం కాదని వాదించారు. 2019లో ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఇదిలా ఉండగా సిటీ సివిల్ కోర్టు (City Civil Court) మొదట లక్ష్మీపార్వతికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే బాలకృష్ణ (Nandamuri Balakrishna) దీనిని హైకోర్టులో (High Court) సవాలు చేశారు. జస్టిస్ జి.రాధారాణి నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ వీలునామా ప్రామాణికతను నిరూపించడంలో లక్ష్మీపార్వతి విఫలమైనట్లు తేల్చింది. ఈ తీర్పు బాలకృష్ణ హక్కులను బలపరిచింది. లక్ష్మీపార్వతి ట్రస్ట్ నిర్వహణలో పాలుపంచుకోవాలనే ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి, ఆయన మరణం తర్వాత కుటుంబంలో తన స్థానం కోసం పోరాడుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ ట్రస్ట్ ను నిర్వహిస్తున్నారు.
తాజాగా లక్ష్మీపార్వతి పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా… లేదా.. అనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బసవతారకం ట్రస్ట్ ను బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. వీలునామా నిజమైందని నిర్ధారణ అయి ఉంటే లక్ష్మీ పార్వతికి ట్రస్ట్ నిర్వహణలో హక్కు లభించేది. కానీ కోర్టు ముందు లక్ష్మీ పార్వతి వాదనలు నిలబడలేదు. దీంతో బాలకృష్ణ విజయం సాధించినట్లయింది.