KCR: కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చ.. అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారా?

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) అంశం మరోసారి రాజకీయ వేడిని రగిలిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో, కాళేశ్వరం అంశంపై అసెంబ్లీలో (Telgangana Assembly) చర్చ జరిగిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ పరిణామాల నడుమ బీఆర్ఎస్ అసెంబ్లీలో గట్టిగా సమాధానం ఇవ్వాలని భావిస్తోంది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్ష కోట్లతో చేపట్టిన ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 655 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది, ఇందులో కేసీఆర్, హరీశ్ రావు, ఇతర ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, బ్యారేజీల నిర్మాణ స్థలాల ఎంపిక, ఆర్థిక అంచనాల మార్పు వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని, దానికి విచారణ అర్హత లేదని వాదిస్తూ కేసీఆర్, హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఆగస్టు 22న విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. అయితే, కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలియజేసిన నేపథ్యంలో, స్టే ఇవ్వడానికి నిరాకరించింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాతే ఏ చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ నేతలకు హైకోర్టులో నిరాశ ఎదురైంది.
హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సమావేశమై, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో హరీశ్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్‌తో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రాజెక్టు పనితీరును సమర్థించడం, నిలిచిపోయిన ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
హరీశ్ రావు ఇప్పటికే ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ పూర్తి రిపోర్టును ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సమగ్ర చర్చ జరపాలని భావిస్తోంది. ఈ చర్చలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ అసెంబ్లీలో గట్టిగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించింది. హరీశ్ రావుకు కేసీఆర్ ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ అసెంబ్లీకి స్వయంగా హాజరై చర్చలో పాల్గొంటే మరింత ప్రభావవంతంగా ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ, కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం, దీంతో హరీశ్ రావు ఈ చర్చలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. హరీశ్ రావు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఖండించారు. కేసీఆర్ అసెంబ్లీ చర్చలో పాల్గొంటారా లేక హరీశ్ రావు ఈ బాధ్యతను నిర్వహిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.