హైదరాబాద్ కు డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు
అంతర్జాతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. నగరంలో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం (ఐడీసీ) ఏర్పాటు చేస్తామని వెల్లడిరచింది. అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) అలెగ్జాండ్ర కార్టర్‌తో సమావేశమయ్యారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇన్నోవేషన్‌పై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. హైదరాబాద్‌లో వార్నర్ బ్రదర్స్ కార్యాలయం ఏర్పాటుతో భారతదేశంతో పాటు నగర మీడియా, ఎంటర్టైన్మెంట్ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఐడీసీ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కార్యకలాపాలకు వ్యూహాత్మక హబ్‌గా ఉంటుంది. ఐడీసీ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలో 1200 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తదుపరి వ్యాపారాభివృద్ధి మేరకు కార్యకలాపాల విస్తరణ ఉంటుంది అని కేటీఆర్ వివరించారు.






