MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడింది? రేవంత్ రెడ్డి పాలనకు ప్రజాభిప్రాయమా..?

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు (Telangana MLC Elections) ముగిశాయి. రెండింటినీ బీజేపీ (BJP) కైవసం చేసుకుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని (Graduates MLC Election) కాంగ్రెస్ (Congress) పార్టీ కోల్పోయింది. అధికారంలో ఉండి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని పోగొట్టుకోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సీటును ఎందుకు కోల్పోయిందనే అంశంపై పలువురు ఆరా తీస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కేడర్ ఈ స్థానాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే ఓడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు ఈ ఓటమి ఓ గుణపాఠం లాంటిదనేది చెప్తున్నారు.
తెలంగాణలో ఉత్తర తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని (Teachers MLC) బీజేపీ మద్దతుదారు మల్క కొమురయ్య గెలుచుకున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి (Chinnamile Anji Reddy) దక్కించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి (Alfores Narendar Reddy) ఓడిపోయారు. అయితే నరేందర్ రెడ్డి గెలుపుకోసం కేడర్ పూర్తిస్థాయిలో పని చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేడర్ కు ఈ విషయంపై దిశానిర్దేశం చేసినా కూడా ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదని ఫీడ్ బ్యాక్ వస్తోంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆయా జిల్లాల ఇన్ ఛార్జులతో పాటు దాని పరిధిలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ముందే సమావేశమై దిశానిర్దేశం చేశారు. బీజేపీ క్షేత్రస్థాయిలో వ్యూహరచన చేస్తుందని.. దానికి అనుగుణంగా కేడర్ మొత్తం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పైగా నియోజకవర్గాల్లో వచ్చే మెజారిటీ ప్రాతిపదికగానే భవిష్యత్తులో పదవులు ఉంటాయని కూడా చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా కేడర్ ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించిందని సమాచారం. పైగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియోజకవర్గ పరిధిలో కూడా కేడర్ పట్టించుకోలేదు.
ఇక అభ్యర్థి ఎంపిక కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. మొదటి నుంచి ప్రసన్న హరికృష్ణకు (Prasanna Harikrishna) టికెట్ దక్కుతుందని అందరూ అనుకున్నారు. హరికృష్ణ కూడా ఆ మేరకు ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే చివరి నిమిషంలో ప్రసన్న హరికృష్ణను కాదని నరేందర్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. దీంతో హరికృష్ణ బీఎస్పీ టికెట్ పొంది పోటీ చేశారు. హరికృష్ణ భారీగా ఓట్లను చీల్చారు. హరికృష్ణకే టికెట్ ఇచ్చి ఉంటే ఓడిపోయేవాళ్లం కాదని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరి చొప్పున బాధ్యత వహించి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేకపోయింది. ఈ ఓటమి ప్రభావం కచ్చితంగా రేవంత్ రెడ్డికి మైనస్ అని చెప్పొచ్చు.