Congress: తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడిందా..? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి?

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాకలు తీరిన రాజకీయనాయకుడు కేసీఆర్ ను కంగు తినిపించి .. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమపథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. వారికి చేతనైనంతగా పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు కూడా. ఈ ఎన్నికలను తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా భావించి .. ఓటేయాలని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు కూడా. అయినా ఫలితాలు ఎందుకిలా వచ్చాయి.? ఇప్పుడిదే అంశం.. కాంగ్రెస్ నేతలు, క్యాడర్ ను గందరగోళంలోకి నెట్టేశాయి.
తెలంగాణలో జరిగిన రెండు టీచర్చ్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఒకటి గెలుచుకోగా, ఒకటి పీఆర్టీయూ మద్దతుతో బరిలో నిలిచిన శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ(PRTU) మద్దతు బరితో బరిలో నిలిచిన శ్రీపాల్‌రెడ్డి(Sreepal Reddy) రెండో ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించారు. ఇక కరీంనగర్–ఆదిలాబాద్–నిజాబాబాద్–మెదక్ టీచర్స స్థానానికి బరిలో దిగిన బీజేపీ మద్దతు దారు మల్క కొమురయ్య(Malka Komuraiah)అనూహ్యంగా విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే కొమురయ్య విజయం సాధించారు. టీచర్స్ బీజేపీకే మద్దతుగా నిలిచారు.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నిన్నటి వరకు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. మెదర్–కరీంనగర్–ఖమ్మం–ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి(Jeevan Reddy) ప్రాతినిధ్యం వహించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. ఇక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో ఈసారి కూడా ఈ స్థానం కాంగ్రెస్‌దే అని అంతా భావించారు. కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి(Narendar Reddy) బరిలో దిగారు. దీంతో విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు. అయితే బీజేపీ తరఫున బరిలో నిలిచిన అంజిరెడ్డి(Anji Reddy) తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సైలెంట్‌గా ప్రచారం చేశారు. దీంతో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ధన బలం ముందు బీజేపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందు రోజు వరకు అంతా భావించారు. మరోవైపు బీఎస్సీ తరఫున బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ(Prasanna Harikrishna) బీసీ కార్డుతో ఓట్లు అడగడంతో ఓట్లు చీలుతాయని అంతా భావించారు.
సీఎం ప్రచారం చేసినా..
చివరికు కాంగ్రెస్ గెలుపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రచారం చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున పోలింగ్‌కు మూడు రోజుల ముందు రెండు మూడు ఉమ్మడి జిల్లాల్లో సభలు నిర్వహించారు. పట్ఠభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీంతో పట్టభద్రులు కాంగ్రెస్‌వైపు మళ్లుతారన్న చర్చ జరిగింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
హస్తం బలహీనపడిందా..?
ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు అధికార హస్తం పార్టీ తెలంగాణలో బలహీన పడిందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్.. ఇదే ప్రచారం చేస్తోంది. ఏడాదికే రేవంత్‌రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారన్న ప్రచారం నిర్వహిస్తోంది.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక స్థానాన్ని కూడా గెలిపించకపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందా అన్న చర్చ జరుగుతోంది.