యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట : సీఎం రేవంత్ రెడ్డి

ఇకపై అన్ని రికార్డులో యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట బోర్డుకు టీటీడీ స్థాయిలో ప్రాధాన్యత ఉండేలా అధ్యయనం చేసి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన నిదులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో రావాలని ఆదేశించారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో నివేదిక అందించాలన్నారు.