Revanth Reddy: పదేళ్లు సీఎం తానేనంటున్న రేవంత్ రెడ్డి..! సాధ్యమేనా..!?

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవలి కాలంలో తన పాలన గురించి ఒక బలమైన వాదనను పదే పదే వినిపిస్తున్నారు. తాను పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్తున్నారు. ఈ ప్రకటన కేవలం ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యాఖ్యగానే కనిపించినా.. దీని వెనుక రాజకీయ వ్యూహం, దీర్ఘకాలిక లక్ష్యాలు, తెలంగాణ (Telangana) ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ లక్ష్యం సాధ్యమేనా అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ అంతర్గత డైనమిక్స్, ప్రతిపక్షాల బలం, ప్రజల మద్దతు.. ఇవన్నీ రేవంత్ భవిష్యత్తుపైన ఆధారపడి ఉన్నాయి.
రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, తన పాలనను ఒక దీర్ఘకాలిక ప్రాజెక్ట్ గా చూపించే ప్రయత్నంలో ఉన్నారు. పదేళ్ల ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని ఆయన ఇటీవల ఒక సభలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం యువతకు ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి పథకాల గురించి మాట్లాడేందుకే కాదు.. తన నాయకత్వంపై ప్రజల్లో స్థిరత్వ భావన కల్పించడానికి కూడా ఉద్దేశించినవని స్పష్టమవుతోంది. తెలంగాణలో గత పదేళ్లు భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) ఆధిపత్యం చెలాయించారు. రేవంత్ రెడ్డి ఈ చరిత్రను సవాలుగా తీసుకుని, తాను కూడా అంతే సుదీర్ఘ కాలం పాలన చేయగలనని సంకేతాలిస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగా, రేవంత్ తన పాలనను “ప్రజా సర్కార్”గా బ్రాండింగ్ చేస్తున్నారు. ప్రజలతో నేరుగా సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రగతి భవన్‌ను జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చడం, ప్రజా దర్బార్‌లు నిర్వహించడం వంటి చర్యలు ఈ దిశలో భాగమే. ఈ చర్యల ద్వారా ఆయన తన పాలనను పారదర్శకంగా, ప్రజాకేంద్రీకృతంగా చూపించాలనుకుంటున్నారు. ఇది ప్రజల్లో విశ్వాసం పెంచి, ఎన్నికల్లో మళ్లీ మద్దతు పొందేందుకు ఉపయోగపడవచ్చు.
రేవంత్ రెడ్డి పదేళ్ల పాలన గురించి మాట్లాడడం వెనుక మరో కీలక అంశం.. ప్రతిపక్షాలైన BRS, BJPలకు ఒక గట్టి సందేశం ఇవ్వడం. BRS నేతలు రేవంత్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని, ఆయన త్వరలో BJPలో చేరతారని విమర్శిస్తున్నారు. అదే సమయంలో, BJP నేతలు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను ఎత్తిచూపుతున్నారు. రేవంత్ స్థానంలో మరొకరు వస్తారని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేవంత్ తన పదేళ్ల వాదన ద్వారా తన పట్ల పార్టీ అధిష్టానం విశ్వాసాన్ని, తన నాయకత్వ స్థిరత్వాన్ని నొక్కి చెబుతున్నారు. ఇది ప్రతిపక్షాల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి లక్ష్యం ఆశాజనకంగా ఉన్నప్పటికీ, దాన్ని సాధించడం అంత సులభం కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. తాజాగా అసెంబ్లీలోనే ఆయన.. రాష్ట్రంలో జీతాలు, మూలధన వ్యయాలకు కూడా డబ్బులు లేవని ప్రకటించారు. కాంగ్రెస్ హామీలైన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి భారీ నిధులు కావాలి. ఈ హామీలు పూర్తిగా అమలు కాకపోతే, ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల గురించి అందరికి తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Utham Kumar Reddy), భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వంటి సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. రేవంత్‌కు పార్టీలో పూర్తి మద్దతు లభించకపోతే, ఆయన స్థానం ప్రమాదంలో పడవచ్చు. మరోవైపు ప్రతిపక్షాల BRSకు ఇంకా రాష్ట్రంలో గట్టి పట్టుంది. BJP తన ప్రభావాన్ని విస్తరిస్తోంది.
అయినా రేవంత్ రెడ్డికి కొన్ని ప్రత్యేక బలాలు ఉన్నాయి. ఆయన వాగ్ధాటి. ప్రజలతో సన్నిహితంగా ఉండే తీరు ఆయనకు పెద్ద ఆస్తి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను 19 సీట్ల నుండి 64 సీట్లకు చేర్చిన ఘనత ఆయనదే. రాహుల్ గాంధీతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల వల్ల AICC కూడా మద్దతును కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన హామీలను అమలు చేసి, ఆర్థిక స్థితిని మెరుగుపరిచి, పార్టీలో ఐక్యతను నిలబెడితే, పదేళ్ల పాలన అసాధ్యం కాదు. మరి మున్ముందు ఆయన ఏం చేస్తారనేది వేచి చూడాలి.