Revanth Reddy : రాష్ట్ర అభివృద్ధికి అమెరికన్ల మద్దతు కావాలి : అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో రేవంత్

తెలంగాణను వచ్చే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అమెరికా 249 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ దార్శనికత దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి అమెరికన్ల మద్దతు కావాలని కోరారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి మార్గదర్శి నిరంతరం ఆవిష్కరణలను అందించడమనే అంశాల్లో అమెరికా ప్రపంచ దృక్కోణాన్ని మార్చింది. ఓటమిని ఎప్పుడూ అంగీకరించని స్ఫూర్తి అమెరికాది. స్ఫూర్తిలో అమెరికా (America) కు, తెలంగాణకు ఎంతో సారూప్యత ఉంది. స్నేహాన్ని కోరుకోవం, బంధాన్ని మరింత పటిష్ఠపరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు.
2008లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ (US Consulate) జనరల్ కార్యాలయం ఏర్పాటైంది. భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించింది. అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహబంధం ఎంతో బలమైంది. అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ (Jennifer Larson) రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలను పట్టిష్ఠపరచడంలో ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. అమెరికా`తెలంగాణల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపరచడానికి మేం ప్రయత్నిస్తున్నాం. అమెరికాలోని అత్యుత్తమమైన సంస్థలను తెలంగాణకు తీసుకొస్తారని ఆశిస్తున్నా. ఈ వేడులకు థీమ్‌గా నిర్దేశించినట్టుగా చెప్పాలంటే, ఒక్కటిగా ఉంటే, మరింత పటిష్ఠంగా ఎదగగలమని విశ్వసిస్తున్నా అని రేవంత్ పేర్కొన్నారు.