Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్నవారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటివరకు నివేదికలు ఇచ్చిన ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్… గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శషభిషలకు తావు లేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
కాళేశ్వరం పేరుతో లక్షకోట్లను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుందన్న సీఎం రేవంత్ రెడ్డి
‘‘ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన మోసం అంతాఇంతా కాదు. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75 శాతం నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రానికి గుదిబండగా మార్చిన కేసీఆర్, హరీశ్‌రావును శిక్షించాల్సిన అవసరం ఈ సమాజానికి లేదా? అంబేడ్కర్‌పై కోపంతో కేసీఆర్ ఆ ప్రాజెక్టు పేరును మార్చి మేడిగడ్డ పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. కేసీఆర్, హరీశ్‌రావులు చేసిన అరాచకాలను ఈటల రాజేందర్ ఆపలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆకృతి, నిర్మాణం, నిర్వహణ సరిగా లేవు. ప్రాజెక్టు వైఫల్యం ఏమాత్రం క్షమించరాని నేరమని ఎన్‌డీఎస్‌ఏ తేల్చిచెప్పింది. దీనికి అప్పటి ప్రభుత్వమే కారణమని చెబితే.. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను ఎన్‌డీయే రిపోర్టని అంటున్నారు. మేడిగడ్డ కూలిపోవడంతో గోదావరిలో రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయి. దీనిపై విచారణ చేయించి లోపాలు ఎత్తిచూపిస్తే అడ్డుకుంటున్నారు. కమిషన్ నివేదికలో ఏమైనా లోపాలుంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్‌ను తక్కువచేసి మాట్లాడటం సరికాదు.
కాంట్రాక్టర్ల కమీషన్లకు కక్కుర్తి పడి…
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం తగ్గేవి. కానీ కాంట్రాక్టర్ల కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించి రూ.6,157 కోట్లు ఖర్చుచేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి ఏడాది రూ.5,523 కోట్లు ఖర్చుచేశారు. ఈ ప్రాజెక్టు కింద రూ.11,670 కోట్లు ఖర్చు చేసిన తరువాత రీడిజైన్ పేరిట బ్యారేజీ స్థలాన్ని మార్చారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించుకునేందుకు మహారాష్ట్ర అంగీకరించింది. అక్కడ ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని వాప్కోస్ చెప్పింది. అక్కడ 205 టీఎంసీల లభ్యత ఉందని అప్పటి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇవేమీ కాదని… మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా నివేదిక ఇవ్వాలని ఆ సంస్థను అడిగారు. 2015లో రీడిజైన్ పేరిట కేసీఆర్ మదిలో పడిన బీజం విషవృక్షమై తెలంగాణ ప్రాంతాన్ని, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది. ప్రాణహిత కాదని చేపట్టిన కాళేశ్వరంతో మూడు బ్యారేజీల నిర్మాణంతో విద్యుత్తు వినియోగం 3వేల మెగావాట్ల నుంచి 8,450 మెగావాట్లకు పెరిగింది రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం.. కాళేశ్వరం రీడిజైన్ కారణంగా రూ.1.47లక్షల కోట్లకు చేరింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లను లూటీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని 4 కోట్ల మంది ప్రజలకు మేం హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగానే దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మేం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించాం. ఎన్‌డీఎస్‌ఏ తాత్కాలిక, తుది నివేదికలు.. విజిలెన్స్ ప్రాథమిక, తుది నివేదికలతోపాటు కాగ్ నివేదికలను జస్టిస్ ఘోష్ కమిషన్‌కు ప్రభుత్వం సమర్పించింది. వాటి ఆధారంగానే కమిషన్ విచారణ జరిపింది. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ తమకు 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని.. అందుకే కమిషన్ నివేదిక చెల్లదని కేసీఆర్, హరీశ్‌రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విద్యుత్తు కొనుగోళ్లలో అక్రమాలపై జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ ఇవే నోటీసులిస్తే.. అలా ఇవ్వడం చెల్లదంటూ కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ అవే నోటీసులివ్వలేదని వితండవాదం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలాంటి ఇబ్బందులున్నందునే జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం. జస్టిస్ ఘోష్‌ది విచారణ కమిషన్ మాత్రమే… నిర్ణయాధికారం లేదు. కమిషన్ నివేదికపై మీరేమైనా సలహాలిస్తే ఇవ్వొచ్చు. లేదంటే లేదు. ప్రభుత్వపరంగా ఎలా ముందుకెళ్లాలో మేం నిర్ణయిస్తాం. అక్రమాలకు పాల్పడినవారిపై ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం.
నిపుణుల కమిటీ విచారణలో తన మామ, బావమరిది ఒత్తిడి చేశారని హరీశ్‌రావు తన నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకొన్నారని 65వ పేజీలో తెలిపింది. ఎంత లోతుల్లోకి వెళ్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి కాబట్టి… కమిషన్ నివేదికపై ఎలా ముందుకెళ్లాలో హరీశ్‌రావు సూటిగా చెప్పాలి. ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ టాక్స్, సీబీసీఐడీ, సిట్‌లలో ఏ విచారణ కావాలో చెప్పాలి తప్ప… తప్పుడు వివరాలతో సభను తప్పుదోవ పట్టించొద్దు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
అక్బరుద్దీన్‌తో వాడీవేడి వాదనలు
సీఎం ప్రసంగం సమయంలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌తో వాడీవేడి వాదనలు చోటుచేసుకున్నాయి. కమిషన్ నివేదికలో ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్, నిపుణుల కమిటీ నివేదికలను పొందుపరచలేదని అక్బరుద్దీన్ పేర్కొనగా… ఎన్‌డీఎస్‌ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల వివరాలు నమోదు చేసిన పేజీల గురించి సీఎం ప్రస్తావించారు. సభలో సీనియర్ సభ్యుడిగా అక్బరుద్దీన్ సలహాలు ఇవ్వొచ్చన్నారు. ఆయనకు సభలో గంటకుపైగా మాట్లాడే సమయమిచ్చామని పేర్కొన్నారు. ఆయన అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి తనకుందన్నారు. కమిషన్ నివేదికపై స్పష్టత ఇచ్చేందుకే సభలో చర్చిస్తున్నామన్నారు. కచ్చితంగా స్పష్టత ఇచ్చిన తర్వాతే సభ నుంచి వెళ్తామన్నారు.
ప్రాజెక్టు నిర్మాణ స్థలం మార్పు కేసీఆర్ కుట్రే…
నిజాం కన్నా సంపన్నుడు కావాలనే దురాశ కలిగిందో… కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చిందో కానీ రీడిజైన్ పేరుతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చాలని కేసీఆర్ కుట్ర పన్నారు.రూ.లక్ష కోట్లు దోచుకోవాలనే దురుద్దేశంతోనే తుమ్మిడిహెట్టి గురించి మరోసారి పరిశీలించాలని కేసీఆర్, హరీశ్‌రావులు కేంద్రానికి లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని మహారాష్ట్ర ఎన్నడూ వ్యతిరేకించలేదు. 152 మీటర్ల ఎత్తులో కడితే తమ రాష్ట్రంలో ఎక్కువ భూమి ముంపునకు గురవుతుందని, తక్కువ ఎత్తులో కట్టాలని మాత్రమే సూచించింది. మహారాష్ట్రతో కేసీఆర్ చర్చల సందర్భంగా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. కానీ, దురాశతో ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాలనుకున్నారు. విశ్రాంత ఇంజినీర్ అనంతరాములు నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీని నియమించినప్పుడే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించొద్దని అనంతరాములు కమిటీ నివేదిక ఇచ్చింది. చీఫ్ ఇంజినీర్ హరిరాం సైతం అదే రాశారు. కానీ రూ.లక్ష కోట్లు కొల్లగొట్టాలనేదే భారత రాష్ట్ర సమితి కుట్ర కాబట్టి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను తొక్కిపెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.