Cancer: ఎమ్మెల్యే దెబ్బకు పరుగులు తీసిన వైద్య శాఖ

అప్పట్లో నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య.. పేదల జీవితాలను అంధకారంలో నెట్టింది. ఆ తర్వాత ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడు బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్(Cancer) మహమ్మారి కోరలు చాస్తోంది. పదుల సంఖ్యలో కుటుంబాలు.. వందల మంది ప్రజలు గ్రామంలో మహమ్మారి దెబ్బకు బలైపోతున్నారు. పచ్చని గ్రామంలో క్యాన్సర్ మహమ్మారి దెబ్బకు ఊరు స్మశాసనంగా మారిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన ప్రజల్లో మొదలైంది.
ఈ సమస్యలో స్థానిక అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(Nallamilli Ramakrishna Reddy).. ఈ తీవ్రమైన సమస్య గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. గ్రామ ప్రజలకు ప్రమాదంకరంగా మారిన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా నల్లమిల్లి ప్రభుత్వాన్ని కోరారు. దీనితో వైద్యాధికారులు రంగంలోకి దిగారు. ఆఘమేఘాల పై స్పందించిన ప్రభుత్వం అధికారులను రంగంలోకి దించింది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు GSL హాస్పిటల్, స్వతంత్ర హాస్పిటల్ సహకారం కోరారు.
నేడు గ్రామంలో 20 వైద్య బృందాలు పర్యటించాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు. ఇంటింటికీ సర్వే చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. బిక్కవోలు మండలంలో ఉన్న బలభద్రపురం గ్రామంలో ప్రజలు గత రెండు సంవత్సరాలుగా ఎక్కువగా.. క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. గ్రామంలోని నలుగురు చిన్న పిల్లలకు అతి అరుదైన కాలేయ సంబంధిత వ్యాధి రావడం అనేది ఆందోళన చెందవలసిన విషయం అని ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడటంతో ప్రభుత్వం పరుగులు తీసింది.