MLC Politics: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పొలిటికల్ గేమ్..!!
తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ కోటా (Governor Quota) ఎమ్మెల్సీ నామినేషన్లు (MLC Nominations) హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల అభ్యర్థిత్వాలను రద్దు చేసింది. అయితే వెనక్కు తగ్గని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్.. మళ్లీ కోదండరామ్ (Prof Kodandaram), మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్లను (Mohammad Azharuddin) పేర్లను గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది. వీళ్లకు గవర్నర్ ఆమోదం లభిస్తుందా..? లేకుంటే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందా.. అనేది ఆసక్తి రేపుతోంది.
సహజంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవల్లో నిష్ణాతులైన వాళ్లకు కేటాయించాలి. అయితే 2023 జూలైలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రావణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను సిఫార్సు చేసింది. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెప్టెంబర్ 19, 2023న వారి పేర్లను తిరస్కరించారు. వాళ్లు రాజకీయాలతో ముడిపడి ఉన్నందున వాళ్లను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. దీనిపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి కేబినెట్ 2024 జనవరిలో కొత్త పేర్లు సిఫార్సు చేసింది. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను సిఫారసు చేసింది. అప్పటి గవర్నర్ జనవరి 27, 2024న వారి పేర్లను ఆమోదించి, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్‌గా పని చేశారు. అలీఖాన్ మైనారిటీ సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు.
మరోవైపు.. బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆర్టికల్ 171(5) ప్రకారం మంత్రి వర్గ సలహాల మేరకు మాత్రమే గవర్నర్ నియమించాలని తెలిపింది. తిరస్కరించే అధికారం లేదని స్పష్టం చేసింది. గవర్నర్ మరోసారి వారి పేర్లను పరిశీలించాలని తెలిపింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 12, 2024న మళ్లీ కోదండరామ్, అలీఖాన్ పేర్లు సిఫార్సు చేసింది. బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆగస్టు 14, 2024లో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. కొత్త నామినేషన్లు తుది నిర్ణయానికి లోబడి ఉంటాయని తెలిపింది.
అయితే ఆగస్టు 13న సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్‌ను మార్చి కోదండరామ్, అలీఖాన్ నామినేషన్లు చెల్లవని తీర్పు చెప్పింది. వాళ్లు ప్రమాణం చేయడాన్ని అనుచితంగా పేర్కొంది. దీంతో బీఆర్ఎస్ నేతలకు ఊరట లభించింది. అయితే కోదండరాంను మళ్లీ మండలికి పంపుతాం.. ఎవడు అడ్డొస్తారో చూస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పి మరీ ఆయన్ను ఇప్పుడు నామినే ట్ చేశారు. ఆయనతోపాటు అమిర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును సిఫారసు చేసింది. మరి ఈ నామినేషన్లపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.
గవర్నర్ ఆమోదిస్తే బీఆర్ఎస్ నేతలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా.. లేకుంటే ఇంతటితో వదిలేస్తారా అనేది తెలీదు. ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి గవర్నర్ కోటా నామినేషన్ల వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.







