Kavitha: కవితకు అండగా పార్టీ సీనియర్లు..?

ఓవైపు రాజకీయ ప్రత్యర్థులతో తలెత్తుతున్న ఇబ్బందులు, మరోవైపు అంతర్గత విభేదాలతో తెలంగాణ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి(BRS) నానా ఇబ్బందులు పడుతోంది. రాజకీయంగా ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బిజెపి దూకుడుగా రాజకీయం చేస్తున్న సమయంలో భారత రాష్ట్ర సమితి అంతర్గత వ్యవహారాలతో తలమునకులవుతోంది. ముఖ్యంగా కవిత వ్యవహారం లో ఏం చేయాలో అర్థం కాక ఆ పార్టీ అధిష్టానం తల పట్టుకుంటుంది.
కల్వకుంట్ల కుటుంబంలో ఈ స్థాయిలో విభేదాలు వస్తాయని ఆ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ ఊహించలేదు. కేసీఆర్ మాటే వేదంగా పనిచేసే కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కవిత విషయంలో కేటీఆర్(KTR) దూకుడుగా వ్యవహరించడం, ఆ పార్టీ సీనియర్ నేతలకు నచ్చటం లేదు అనే ప్రచారం ఇటీవల జరిగింది. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం, కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే విషయంలో కూడా కేటీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
గత నెలలోనే కవితను ఎలాగైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని కేటీఆర్ ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు. అక్కడి నుంచి కవిత కేటీఆర్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ నివేదికను కూడా కేసీఆర్ కు కవిత అందించినట్లు ప్రచారం జరిగింది. ఇక గత నెలలో కేసీఆర్ పై కేటీఆర్ తీవ్రంగా ఒత్తిడి చేసి, కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
అయితే ఈ విషయంలో పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. లిక్కర్ కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లి వచ్చారని, ఆ తర్వాత కూడా పార్టీ నాయకులు పై ఆమె ఆ కేసు కు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, కెసిఆర్ పై కేసు నమోదైన సరే కవిత మౌనంగానే ఉన్నారని, అలాంటి వ్యక్తిపై సస్పెన్షన్ విధిస్తే అనవసరంగా పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత కవిత తనను వాడుకుని వదిలేశారు అనే సెంటిమెంట్ కూడా రగిలించే అవకాశం ఉండవచ్చని, పార్టీ సీనియర్ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనితోనే కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కుటుంబంలో కూడా కవితను సస్పెండ్ చేయవద్దు అనే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. హరీష్ రావు కూడా కవితను సస్పెండ్ చేసే విషయంలో కేటీఆర్ తో విభేదిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.