MLC :ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణాలేంటి..?

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ కు గట్టి షాకిచ్చేలా పక్కాగా విజయాన్ని ఖరారు చేసుకుంది. విపక్షంలో ఉన్నప్పుడు తాము గెల్చుకున్న సిట్టింగ్ ఎమ్మెల్సీని సైతం హస్తం(congress) చేజార్చుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది.ఇంతలో అంత తేడా ఎలా సాధ్యమైంది.దీనికి బీజేపీ ఎలాంటి వ్యూహాలు అవలంభించింది.?
ఈ సారి తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రూపంలో ఉన్నారు. మరోవైపు..ఎన్నికలు జరిగిన స్థానాల్లో నలుగురు ఎంపీలున్నారు. ఇలాంటి తరుణంలో టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఈ ఎన్నికలు బీజేపీ నేతలకు చావో,రేవో అన్నట్లుగా మారాయి. హైకమాండ్ సైతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేసింది. దీంతో గెలిస్తేనే .. హైకమాండ్ పెద్దలకు ముఖం చూపించగలిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో డూ ఆర్ డై అన్నట్లుగా కమలం శ్రేణులు పనిచేశాయి.
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి(kishan reddy).. ఇంచుమించుగా ప్రతీ కార్యకర్తను కార్యోన్ముఖుడిని చేశారు. ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టి ముందుకెళ్లారు. గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేశారు. మరోవైపు.. బండి సంజయ్(bandi sanjay) సైతం ఎన్నికల్లో గెలుపుకోసం శాయసక్తులా కృషి చేశారు. అందులోనూ తన నియోజకవర్గం ఉన్న స్థానంలో ఎమ్మెల్సీ ఎన్నిక రావడం.. ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎప్పుడైతే కేంద్రమంత్రులే స్వయంగా ఎన్నికల ప్రచారం చేస్తుండడంతో.. మిగిలిన క్యాడర్ , నేతలు సైతం బరిలో శ్రమించారు. సుశిక్షితులైన సైనికుల్లా ప్రచారపర్వంలో దూసుకెళ్లారు.
దీనికి తోడు బీజేపీకి విద్యాధికుల్లో ఉన్న ఆదరణ కూడా బీజేపీకి కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కార్… మిగిలిన హామీల అమలుపై ప్రజల నుంచి, పార్టీల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటినే ప్రజల్లో సంధించి, ప్రచారపర్వంలో ఆధిక్యం సాధించింది కమలం పార్టీ. కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందన్న దానికి .. ఈ ఎన్నికల ప్రచారంలో తగిన బదులిచ్చారు కేంద్రమంత్రులు . మరోవైపు.. కాంగ్రెస్ లో శ్రేణులు లైట్ గా తీసుకోవడంతో ఈ ఫలితం ఆవిష్కృతమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.