Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్..!?

వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను (BJP State Presidents) భర్తీ చేయడంపై ఆ పార్టీ హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ పరంగా వివిధ రకాల పోస్టులను భర్తీ చేసిన తర్వాత జాతీయ అధ్యక్షుడిని కూడా మార్చనుంది. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు (Telangana BJP President) రాబోతున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అందుకు ముహూర్తం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపే కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని సమాచారం. ఆ పదవికోసం ఎంతోమంది పోటి పడినా బండి సంజయ్ (Bandi Sanjay) వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారాయన. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2020 మార్చి నుంచి 2023 జూలై వరకూ ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో బీజేపీ దూకుడు ప్రదర్శించింది. అప్పటి కేసీఆర్ (KCR) ప్రభుత్వానికి బండి సంజయ్ ముప్పుతిప్పలు పెట్టారు. బండి సంజయ్ హయాంలో బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికలతో (GHMC Elections) పాటు, దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించింది. పార్టీకి పూర్తి సమయం కేటాయించే బండి సంజయ్ కేడర్ ను ఉత్తేజపరచడంలో ముందుంటారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉండేదనే భావన చాలా మందిలో ఉంది.
అయితే అంతర్గత రాజకీయాల వల్ల బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించింది హైకమాండ్. దాని ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్న దశ నుంచి కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో తప్పు చేశామనే భావన చాలా మందికి ఉంది. అందుకే బండి సంజయ్ కి మళ్లీ పగ్గాలివ్వాలని చాలా మంది కోరారు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత బండి సంజయ్ కి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఇక అధ్యక్ష పదవి లేనట్టే అని అనుకున్నారు. ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్ర రావు, రఘునందన్ రావు తదితరుల పేర్లు అధ్యక్ష పదవికి బలంగా వినిపించాయి.
అయితే ఇప్పుడు సీన్ మారినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ అయితేనే పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించగలరని హైకమాండ్ నమ్ముతున్నట్టు సమాచారం. ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి అధ్యక్ష పదవి అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్న మాట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన పని చేయనున్నారు. ఈ నెలాఖరు లోపు లేదంటే వచ్చే నెల మొదటివారంలో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్ (Etela Rajendar), డీకే అరుణకు (DK Aruna) కేంద్రంలో సహాయ మంత్రి పదవులు కట్టబెడతారని తెలుస్తోంది. మొత్తానికి రాబోయే నెల రోజుల్లో బీజేపీలో పెను మార్పులు చూడడం ఖాయం.