తెలంగాణలో అజ్యూర్ పవర్ గ్లోబల్ 700 కోట్ల పెట్టుబడి
తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రీమియర్ ఎనర్జీ మరింతగా విస్తరించనున్నది. అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ తో జట్టు కట్టిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్ హైదరాబాద్ లోని తన ప్లాంట్ ను మరింతగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. తన విస్తరణ కార్యకలాపాల ద్వారా సుమారు 4 వేల కోట్ల రూపాయల సోలార్ సేల్స్ మరియు సోలార్ మాడ్యుల్లని రానున్న నాలుగు సంవత్సరాలలో సరఫరా చేసేందుకు ఈ అవగాహన ఒప్పందం ఉపయోగపడుతుంది. ప్రీమియర్ ఎనర్జి మరియు అజ్యూర్ పవర్ గ్లోబల్ 700 కోట్ల రూపాయలతో 1.25 గిగా వాట్లా చొప్పున సోలార్ సెల్ మరియు సోలార్ మాడ్యూల్ ప్లాంట్లను రెండింటిని (మొత్తం 2.5GW) ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు హైదరాబాద్ లోని ఈ-సిటీలో నూతన ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పత్రాలను ఈరోజు మంత్రి కేటీఆర్ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. ఈ ఏడు వందల కోట్ల రూపాయల నూతన పెట్టుబడితో సుమారు మూడు వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
కంపెనీ ప్రతినిధులతో ఈరోజు హైదరాబాద్ లో సమావేశం అనంతరం, అనుమతి పత్రాలు అందించిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఏడు వందల కోట్ల అదనపు పెట్టుబడిని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియర్ ఎనర్జీ వంటి కంపెనీలు తిరిగి మరిన్ని పెట్టుబడులు పెట్టడం అంటే ఇక్కడ ఉన్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ప్రీమియర్ ఎనర్జీ మరియు అజ్యూర్ పవర్ గ్లోబల్ మరింతగా విస్తరించాలని ఆకాంక్షించిన మంత్రి కేటీఆర్ అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచస్థాయి సోలార్ మాడ్యుల్ మరియు సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు అజ్యూర్ పవర్ గ్లోబల్ చైర్మన్ అలన్ రోస్లింగ్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రంగంలో తయారీ ప్లాంట్ ఉన్న కొన్ని రాష్ట్రలలో తెలంగాణ ఒకటిగా నిలబడుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియర్ ఎనర్జీ, అజ్యూర్ పవర్ గ్లోబల్ తో సోలార్ తయారీ కార్యకలాపాల విస్తరణ కోసం జట్టు కట్టడం సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి విధానాలు, స్నేహపూర్వక పారిశ్రామిక వాతావరణం వల్లనే తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రీమియర్ ఎనర్జీ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్, చిరంజీవి సలుజ, మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమకు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.






