TTDP: టీడీపీ సంగతి ఏంటో మరి…?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ(TDP) బలోపేతంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది అనే ప్రచారం జరుగుతోందే గాని.. ఇప్పటివరకు ఎటువంటి కీలక అడుగు పడలేదు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టిడిపి.. తెలంగాణలో కూడా దృష్టి పెట్టి బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో భారత రాష్ట్ర సమితి నుంచి కొంత మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు కూడా వచ్చాయి.
కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)తో భేటీ కూడా అయ్యారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడు కూడా కండువా కప్పుకోలేదు. అటు భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పాత్రలో బలంగా నిలబడేందుకు కాస్త గట్టిగానే కష్టపడుతోంది. ఈ సమయంలో టిడిపి బలం పుంజుకునే ఉద్దేశం ఉంటే.. ఆ పార్టీ నాయకులను తీసుకుంటుందని కొందరు కార్యకర్తలు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా.. కొంతమంది టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.
కానీ ఇప్పటివరకు ఎటువంటి అడుగులు పడలేదు. ఇక చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ నేతలతో పెద్దగా సంప్రదింపులు జరపడం లేదు. ఏపీలో ప్రభుత్వంలో బిజీగా ఉండటంతో.. ఆయన తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఇక జిల్లాల అధ్యక్షులు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి అడుగు వేయలేదు. ఇక నియోజకవర్గ నాయకత్వంతో కూడా చంద్రబాబు పెద్దగా మాట్లాడటం లేదు.
పార్లమెంట్ ఇన్చార్జి లతో పాటుగా నియోజకవర్గాల ఇన్చార్జిల్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది. ఇక బిజెపి కొన్ని స్థానాలు పై ఫోకస్ పెట్టడంతో ఆ స్థానాలు వదిలేసి.. మిగిలిన స్థానాలపై పార్టీ ఫోకస్ పెట్టచ్చని భావించారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంతో టీటీడీపీ కార్యకర్తలు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.