Gandhi Bhawan: కాంగ్రెస్ వాదులకు పార్టీ పదవుల్లో అందలం .. తెలంగాణలో ఏఐసీసీ సరికొత్త ప్రయోగం…

ప్రస్తుత రాజకీయాల్లో ఆయారాం.. గయారాంలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అధికారం ఏపార్టీకి దక్కుతుందో .. అక్కడకు జంప్ చేసేస్తారు. అంతేకాదు.. ఉన్నత పదవులను అధిష్టిస్తుంటారు. పాపం జెండాను పట్టుకుని తిరిగిన వారు మాత్రం.. ఎదుగుబొదుగు లేక అక్కడే అలాగే ఉండిపోతారు. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి అతిపెద్ద పార్టీలో.. మరింత అధికం. అందుకే పార్టీలో కొత్తగా వచ్చినవారికి ఉన్న ప్రాధాన్యం.. తమకు దక్కలేదంటూ పలువురు సీనియర్లు పార్టీని వీడిన సందర్భాలున్నాయి. ఫలితంగా ఎన్నికల్లో ఓటములు కూడా చాలానే ఎదురయ్యాయి.
అయితే వీటికి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త ఫార్ములా రెడీ చేసింది.సుదీర్ఘకాలంగా తెలంగాణలో పార్టీకి సేవలందిస్తున్న నాయకులను గుర్తించి.. తగిన ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. ఆయా నాయకుల వివరాలతో పీసీసీ(PCC) జాబితా రూపొందించింది. వారు ఎన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు? ఇప్పటివరకు ఏయే పదవులు నిర్వహించారు? ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు? తదితర వివరాలు ఆ జాబితాలో ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(nata rajan) ఆదేశాలతో ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్‌లు ఆ జాబితాలో ఉన్న నాయకులకు ఫోన్లు చేసి గురువారం గాంధీభవన్‌కు పిలిపించారు. ప్రస్తుతం పార్టీ పదవి కావాలా? నామినేటెడ్ పదవి కావాలా? ఏ పదవి ఇస్తే సమర్థంగా నిర్వహించగలరు? వంటి ప్రశ్నలు అడిగారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వారిని.. అదనపు బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా? అని ఆరా తీశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. తనకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కావాలని కోరారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎమ్మెల్సీ పదవిని కోరారు. గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్య.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లేదా, మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు చెప్పారు. పీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి సైతం మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కోరారు.
ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బల్మూరి వెంకట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు కూడా ఏఐసీసీ కార్యదర్శుల ముందు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. మొత్తం 48 మందితో జాబితా రూపొందించగా.. గురువారం దాదాపు 40 మంది గాంధీభవన్‌కు వచ్చారు. ఈ నూతన ఒరవడి పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని, సీనియర్లకు న్యాయం జరుగుతుందని ఆయా నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు.