నాడు కేసీఆర్.. నేడు రేవంత్..! దొందూ దొందే..!!

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరిపోయారు త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారనే టాక్ నడుస్తోంది. అయితే ఇలా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం చట్టవిరుద్ధమంటోంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రం నీవు నేర్పిన విద్యయే కదా అని ఎద్దేవా చేస్తోంది. నాడు కేసీఆర్ కూడా ఇలా ఎమ్మెల్యేలను అడ్డదిడ్డంగా చేర్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ చేస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రాగా బీఆర్ఎస్ కు 39 స్థానాలు దక్కాయి. 8 సీట్లను బీజేపీ చేజిక్కించుకుంది. ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి అధికారం మూణ్ణాళ్ల ముచ్చటేనని బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తూ వచ్చింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికలు కూడా రావడంతో వీటిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే బీఆర్ఎస్ ఒక్క చోట కూడా గెలవలేక పోయింది. పార్టీ పెట్టినప్పటి నుంచి తొలిసారి ఆ పార్టీకి లోక్ సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో గెలిచాయి. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేందుకు ఇదే తగిన సమయం అని భావించిన రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. తన ప్రభుత్వాన్ని పడగొడతామని ఛాలెంజ్ చేసిన వాళ్లకు తానేంటో నిరూపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీళ్ళ చేరిక కూడా అనూహ్యంగా జరుగుతోంది. రేవంత్ రెడ్డి కండువా కప్పేంత వరకూ కూడా ఈ చేరికల విషయం బయటకు రావట్లేదు. దీంతో బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. ఎవరు ఎప్పుడు పార్టీ మారతారోనని ఆందోళన చెందుతోంది. పార్టీ మారుతున్న నేతల ఇళ్ల దగ్గరకు వెళ్లి ఆందోళనలు చేస్తోంది. ఇలా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి తగదని.. చట్ట విరుద్ధమని విమర్శిస్తోంది. అయితే బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. 2014, 2018 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్నా కూడా బీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంది. వాళ్లకు మంత్రివర్గంలో స్థానం కూడా ఇచ్చింది. అప్పుడు మీరు చేస్తే ఒప్పు.. ఇప్పుడు మేం చేస్తే తప్పా.. అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకోవాలనుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ.