KCR – Chandrababu: కేసీఆర్ మరోసారి చంద్రబాబునే నమ్ముకున్నారా..?

ఆంధ్రప్రదేశ్ విభజనకు (AP Bifurcation) కేసీఆర్ (KCR) కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన పోరాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) సాకారం చేసుకున్నారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారు. సక్సెస్ అయ్యారు. అయితే ఆంధ్రా పాలకులే లక్ష్యంగా కేసీఆర్ చేసిన పోరాటం, మాట్లాడిన మాటల వల్లే తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలను రగిల్చాయి. ముఖ్యంగా చంద్రబాబు (Chandrababu) టార్గెట్ గా కేసీఆర్ చేసిన కామెంట్స్ ఉద్యమానికి ఊపిరిలూదాయని చెప్పొచ్చు. ఉద్యమం కాస్త చల్లారుతుందునుకుంటున్న ప్రతిసారీ చంద్రబాబు టార్గెట్ గా కేసీఆర్ వ్యూహరచన చేసేవారు.
2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్. పదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆయన ఓడిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా ఫాంహౌస్ (KCR Farm House) కే పరిమితమయ్యారు. అయితే తాజాగా బీఆర్ఎస్ భవన్ (BRS Bhavan) లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు కేసీఆర్. చాలాకాలం తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ పనైపోయిందని అందరూ అనుకుంటున్నారని.. అయితే పార్టీ మరో వందేళ్లు ఉంటుందని ఆయన చెప్పారు. చంద్రబాబు మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో, ఏపీలో ఎన్డీయే (NDA) కూటమి అధికారంలో ఉంది. ఆదే ఊపులో తెలంగాణలో కూడా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ (TDP), జనసేనకు (Janasena) కూడా కాస్తోకూస్తో తెలంగాణలో బలముంది. వాటిని కూడా కలుపుకుపోయి సత్తా చాటాలని బీజేపీ (BJP) స్కెచ్ వేస్తోంది. ముఖ్యంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) టీడీపీ, జనసేన ప్రభావం బలంగా ఉంటుంది. పైగా ఇటీవల చంద్రబాబు కూడా తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాస్త ఫోకస్ పెట్టారు. తీగల కృష్ణారెడ్డి, బాబూమోహన్ లాంటి నేతలు కూడా మళ్లీ టీడీపీ గూటికి చేరారు. ఎన్డీయే పార్టీలన్నీ ఇక్కడ కూడా కలిసి పోటీ చేయడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్నాయి.
ఇదే విషయాన్ని కేసీఆర్ మరోసారి పార్టీ శ్రేణులకు వివరించారు. బీజేపీ ప్రస్తావన తేకుండా కేవలం చంద్రబాబును మాత్రమే ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి కేసీఆర్ కు ఇది అలవాటే. పార్టీ కష్టాల్లో ఉందనుకున్నప్పుడు సెంటిమెంటు రగల్చడం, దాన్ని సొమ్ము చేసుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ మరోసారి రాజకీయాలు చేయడం మొదలు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు భావోద్వేగాలకు కరిగిపోతారా..? పదేళ్ల కేసీఆర్ పాలనను వ్యతిరేకించి ఓడించిన వాళ్లు చంద్రబాబు లాంటి బూచీలను నమ్మి కేసీఆర్ కు ఓటేస్తారా అనేది వేచి చూడాలి.