ఏడాదిలో రూ.6లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాదీ!
ఇష్టమైన తిండి కోసం అడపా దడపా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడం ఎవరైనా చేసే పనే. అంతేకాదు.. ఇష్టమైన తిండి కోసం ఎంత దూరమైనా వెళ్లి తిని రావడం కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అయితే ఒకే వ్యక్తి ఒకే రకమైన తిండి కోసం లక్షలు ఖర్చు పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా..? కానీ ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇడ్లీలకోసం ఏడాదిలో 6 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. అదీ మన హైదరాబాదీ.!
ప్రతి ఏటా మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇడ్లీలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ సంస్థలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలాగే ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా ఈ ఏడాది కాలంలో ఇడ్లీల డెలివరీలకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్విగ్గీ విడుదల చేసిన ఇడ్లీలకు సంబంధించిన సమాచారంలో ఓ అంశం తీవ్ర ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి గత ఏడాది కాలంలో.. అంటే గతేడాది మార్చి 30 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకూ 6 లక్షల రూపాయల విలువైన ఇడ్లీలను స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఆయన 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశారట. అంటే సగటున రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలను కొనుగోలు చేశారు. ఈ ఇడ్లీలన్నీ తనే తిన్నాడా అంటే కాదు.. తను వివిధ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు తన కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం అతను ఈ ఇడ్లీలను ఆర్డర్ చేశారట.
ఇక ఇడ్లీలకు సంబంధించి మిగిలిన సమాచారాన్ని చూస్తే.. ఈ ఏడాది కాలంలో 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీ కస్టమర్లకు డెలివర్ చేసిందట. ఇడ్లీలను ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వాసులు ఆర్డర్ చేస్తున్నట్టు స్వీగ్గీ వెల్లడించింది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఎక్కువ మంది ఇడ్లీలకే ప్రిఫర్ చేస్తున్నట్టు తెలిపింది. డిన్నర్ సమయంలో కూడా పలువుర ఇడ్లీలు తినేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించింది స్విగ్గీ. ఏదేమైనా ఈ ఏడాది స్విగ్గీ వెల్లడించిన సమాచారంలో ఒకే వ్యక్తి 6 లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేశారనడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది.






