TCong MLCs : ఎమ్మెల్సీ జాబితాలో కాంగ్రెస్ మార్క్..!! రాములమ్మకు లక్కీ ఛాన్స్..!!

తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల (Telangana MLC Elections) జరగబోతున్నాయి. అసెంబ్లీలో ఇప్పుడున్న బలాబలాలను బట్టి కాంగ్రెస్ (Congress) కు మూడు, బీఆర్ఎస్ (BRS) కు ఒకటి కచ్చితంగా వస్తాయి. అయితే సీపీఐతో (CPI) కలిపి కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఒక సీటును సీపీఐకి ఇస్తున్నట్టు వెల్లడించింది. అయితే నాలుగు స్థానాలు గెలవాలంటే కచ్చితంగా కనీసం 82-83 మంది సభ్యుల బలం అవసరం. అయితే సీపీఐతో కలిపి కాంగ్రెస్ కు 65 సీట్లు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన 10 మందితో కలిపితే 75 అవుతుంది. అయినా 7-8 సీట్లు కాంగ్రెస్ కు అవసరం.
కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న అద్దంకి దయాకర్ (Addanki Dayakar) తో పాటు శంకర్ నాయక్ (Shankar Naik), విజయశాంతికి (Vijayashanthi) పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ అవకాశం ఎవరికి లభిస్తుందో అన్న ఉత్కంఠకు తెరపడింది. అద్దంకి దయాకర్ పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పార్టీ ఆదేశాల మేరకు టికెట్ త్యాగం చేశారు. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు వస్తుందనుకున్నారు. అయితే కుదరలేదు. ఇప్పుడు అద్దంకి దయాకర్ కు పార్టీ అవకాశం కల్పించింది.
రెండో స్థానాన్ని కేతావత్ శంకర్ నాయక్ కు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గిరిజన నేతగా మంచి గుర్తింపు పొందారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గిరిజనుల్లో మంచి పట్టుంది. జానారెడ్డి, కోమటిరెడ్డి వర్గీయులకు ఆత్మీయుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం నిత్యం పరితపించేవారు. సామాన్య కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. గిరిజనుల్లో మంచి పట్టున్న నేతగా పొందిన శంకర్ నాయక్ కు ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఇద్దరూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారే కావడం విశేషం.
ఇక మూడో స్థానాన్ని అనూహ్యంగా విజయశాంతికి ఇచ్చింది హైకమాండ్. వారం రోజుల కిందటి వరకూ అసలు విజయశాంతి పేరు తెరపైనే లేదు. కానీ అనూహ్యంగా ఆమె ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని (Mallikarjuna Kharge) కలిసి టికెట్ అడగడం., అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విజయశాంతి గురించి ఆరా తీయడంతో ఆమె పేరు తెరపైకి వచ్చింది. మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) వల్లే విజయశాంతికి టికెట్ దక్కిందని భావిస్తున్నారు. మొత్తానికి అద్దంకి దయాకర్ మినహా మిగిలిన ఇద్దరి పేర్లను ఎవరూ ఊహించలేదు. అయితే టికెట్ ఆశించి దక్కని పలువురు నేతలు తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. అయితే సంఖ్యాబలం లేకపోయినా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి బరిలో ఉండడంతో ఈ ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి.