YCP: వైసీపీ తీరు మారదా..?
ఆంధ్రప్రదేశ్ (AP) లో దారుణ పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పరితపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి రావడానికి పెద్దగా ఇష్టం చూపని జగన్ (YS Jagan), ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. ఇది ఆ పార్టీ అధినేతలో వచ్చిన మార్పు. అయితే ఇప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు గ్రహించట్లేదని, అధినేత జగన్ ను కొందరు పార్టీ నేతలు మభ్యపెట్టి భ్రమల్లో ఉంచుతున్నారనే వారి సంఖ్య ఆ పార్టీలో పెరుగుతోంది. తాజాగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (Mekapati Rajamohan Reddy) చెప్పిన మాటలను కొందరు సమర్థిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మేల్కోవాలని, వాస్తవాలను గ్రహించాలని సలహా ఇస్తున్నారు.
వైసీపీ గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. 151 సీట్ల నుంచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత స్థాయికి దిగజారిపోవడం ఆ పార్టీ అస్సలు ఊహించలేదు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్నీ అమలు చేశామని, పాలనలో అనేక సంస్కరణలు అమలు చేశామని జగన్ చెప్తున్నారు. ఆ ఓట్లన్నీ ఏమైపోయాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంలే తమ పార్టీని ఓడించాయని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టేసి భ్రమల్లో బతికేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తప్పించి పైస్థాయిలో ఉన్న మెజారిటీ నేతల తీరూ ఇలాగే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో నేతలు మాత్రం ఈవీఎంలు కారణం కాదని అర్థం చేసుకున్నారు.
ఐప్యాక్ విపరీత హైప్, జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను మభ్యపెట్టాయి. ప్రజలు కనీవినీ ఎరుగని పట్టం కట్టారు కాబట్టి తాము ఏం చేసినా చెల్లుతుందనే భావనను జగన్ కు కల్పించారు. కోటరీ మాటలు విన్న జగన్, విపక్షాలపై విరుచుకుపడేందుకు పర్మిషన్ ఇచ్చారు. టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టి బొక్కలో తోశారు. అమరావతిని తొక్కేసి మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. బటన్లు నొక్కి డబ్బులేయడం తప్పా, రాష్ట్రాభివృద్ధిని, పారిశ్రామికాభివృద్ధిని పట్టించుకోలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే అలాంటి వాళ్లపై కక్షగట్టి కేసులు పెట్టించారు. అధికారం ఉందికదా అని అణచివేస్తామంటే ఎవరూ సహించరు. జగన్ విషయంలో అదే జరిగింది.
ఇప్పుడు కూడా వైసీపీ ఆలోచనాతీరులో మార్పు కనిపించట్లేదు. ఇప్పటికీ కొందరు నేతలు జగన్ కు వాస్తవాలు తెలియనీయట్లేదు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. సొంత మీడియాలో గూగుల్ డేటా సెంటర్ ను గోడౌన్ తో పోల్చి కథనాలు వండి వార్చారు. చివరకు తేడా కొడుతోదని గ్రహించి యూటర్న్ తీసుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింపోయింది. మొంథా తుపానును మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా అభివర్ణించారు జగన్. ప్రకృతి విపత్తులను మనుషులు క్రియేట్ చేయలేరు. కంట్రోల్ చేయలేరు. అయితే వీలైనంత నష్టం తగ్గించడంపైనే దృష్టిపెట్టాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు ఎలా పని చేస్తారో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబును విమర్శించాలి కాబట్టి ఆయనపై జగన్ నోరు పారేసుకున్నారు. ఇది కూడా బూమరాంగ్ అయింది. చంద్రబాబు, పవన్, లోకేశ్ ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు జెట్లలో ప్రయాణిస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏమైనా తన వ్యక్తిగత సొమ్ముతో పర్యటనలు చేశారా.. అంటే దానికి సమాధానం లేదు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్లు చెప్తున్నది ఇదే. ఇప్పటికైనా వాస్తవాలను జగన్ కు చెప్పాలని ఆయన చుట్టూ ఉన్నవాళ్లకు మేకపాటి సలహా ఇచ్చారు. లేకుంటే జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరని తేల్చి చెప్పేశారు. అసత్యాలను పదేపదే ప్రచారం చేస్తే అవి నిజాలు అయిపోవు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకునేందుకు క్షణకాలం చాలు. కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పి, వాళ్ల మన్ననలు పొందాలి. ప్రతి అంశాన్ని పనిగట్టుకుని విమర్శించడం ద్వారా మేలు జరగకపోగా మరింత కీడు ఎదురవుతుంది. ఇప్పటికైనా వైసీపీ తన స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది ఆ పార్టీ నేతలే చెప్తున్న మాట.







