YS Jagan: 21లోపు సీబీఐ కోర్టుకు జగన్..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan) అక్రమాస్తుల కేసులో న్యాయపరమైన చిక్కులు తప్పట్లేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ గతంలో దాఖలు చేసిన మెమోను ఆయన తరఫు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court) ఎదుట ఆయన హాజరు అవుతారని తెలిపారు. దీంతో వైఎస్ జగన్ కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించినప్పటికీ, ఇప్పుడు ప్రతి విచారణకు ఆయన హాజరుకావాలంటూ సీబీఐ పట్టుబడుతోంది. కోర్టు కూడా జగన్ హాజరు కావాలని స్పష్టం చేసింది.
జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విధించిన బెయిల్ షరతుల ప్రకారం, ఆయన ప్రతి విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిబంధన నుంచి తాత్కాలిక మినహాయింపు పొందారు. ఈ పరిణామాల నేపథ్యంలో గత అక్టోబర్‌లో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14న కచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని షరతు విధించింది. ఈ గడువు సమీపిస్తున్న తరుణంలో, నవంబర్ 6న జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు మరో మెమో దాఖలు చేశారు. ఇందులో, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
మంగళవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం ఈ మినహాయింపు మెమోపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది జగన్‌కు మినహాయింపు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బెయిల్ షరతుల ప్రకారం, ఆయన ప్రతి విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ, కౌంటర్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత, ఆయనకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదని సీబీఐ గట్టిగా వాదించింది. దీనికి జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి సమాధానమిచ్చారు. గతంలో హైకోర్టు సైతం మినహాయింపు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడం అధికార యంత్రాంగానికి ఇబ్బందికరమనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపు కోరామని, అంతేకానీ కోర్టుకు హాజరయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వివరణ ఇచ్చారు.
న్యాయమూర్తి ముందు సీబీఐ చేసిన వాదనల తీవ్రత, నవంబర్ 14న హాజరుకావాలంటూ గతంలో విధించిన షరతు దృష్ట్యా, జగన్ తరఫు న్యాయవాది వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమ క్లయింట్ ఈ నెల 21వ తేదీలోగా కోర్టు ముందు హాజరవుతారని పేర్కొన్నారు. పాత మినహాయింపు మెమోను ఉపసంహరించుకుని, కోర్టుకు హాజరయ్యేందుకు సమ్మతి తెలియజేస్తూ కొత్త మెమో దాఖలు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ గతంలో దాఖలు చేసిన వ్యక్తిగత హాజరు మినహాయింపు మెమోను కొట్టివేస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో నవంబర్ 21లోగా జగన్ కచ్చితంగా సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో జగన్ హాజరు, తదుపరి విచారణ ఏ మలుపు తీసుకుంటాయోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.







