పేదవాడి ‘సొంతింటి కల’ను నెరవేరుస్తున్నాం : సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. ఒకేసారి 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కేవలం రెండు విడతల్లోనే పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుంది. మొదటి దశలో 28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోపని పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ రాబోతున్నాయని, పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్నామని జగన్ ప్రకటించారు.
తొలి దశను జూన్ 2022 నాటికి పూర్తి చేస్తామని, రెండో దశను కూడా అప్పుడే ప్రారంభిస్తామని జగన్ ప్రకటించారు. 8,900 లే అవుట్లలో 11 లక్షల 26 వేల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఆ కాలనీల్లో 4,128 కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని, 22,587 కోట్లతో కానీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కాలనీల్లో అధునాత సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని, ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలకు మూడు ఆప్షన్లు ఇచ్చాం : జగన్
340 చదరపు అడుగుల ఇంటిలో ఓ బెడ్‌రూం, హాల్, కిచెన్, బాత్‌రూమ్, వరండా ఏర్పాటు చేస్తామని, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, 4 బల్బులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అవసరమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సమకూర్చడం ఓ ఆప్షన్ అని, అవసరమైన నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారే తెచ్చుకునే స్వేచ్ఛ ఇవ్వడం రెండో ఆప్షన్, ప్రభుత్వం నిర్దేశించిన నిర్మాణ సామాగ్రితో పాటు ఇంటి నిర్మాణ బాధ్యతను కూడా ప్రభుత్వమే చూసుకోవడం మూడో ఆప్షన్ అని జగన్ వివరించారు. 30 రకాల పనులు చేసే వారికి సొంత గ్రామాల్లోనే ఉపాధి లభిస్తుందని, దాదాపు 21.70 కోట్ల పనిదినాలు కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.