Dangeti Jahnavi : అంతరిక్షంలోకి తెలుగు అమ్మాయి…ఎప్పుడంటే ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి (Dangeti Jahnavi) అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. అమెరికా (America)కు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ర్టీస్ (టీఎస్‌ఐ) చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థి (ఏఎస్‌సీఏఎన్)గా జాహ్నవి ఎంపికయ్యారు. ఇప్పటివరకు భారత్ (India)లో జన్మించి, ఇక్కడే నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు. అయితే, టైటాన్ స్పేస్ (Titan Space) ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తిచేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్ (Space mission)కు అర్హత సాధించింది. టైటాన్ స్సేస్ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది.
భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయోగ, వాణజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదద్దనుంది. ఈ మిషన్‌లో భాగంగా తొలుత కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొననుంది. ఈ యాత్రలో భాగంగా ఆమె ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అమెరికాతోపాటు పలుదేశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు.