YCP: ప్రభుత్వ వేధింపులపై పోరాటానికి YCP యాప్… జగన్ కీలక ప్రకటన..!!

తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కేంద్ర కార్యాలయంలో జరిగిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ వేధింపులు, అన్యాయాలను ఎదుర్కొనేందుకు YSRCP త్వరలో ఒక ప్రత్యేక యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని, సంబంధిత ఆధారాలను అప్‌లోడ్ చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదులు ఆటోమేటిగ్గా YCP డిజిటల్ సర్వర్‌లో నమోదవుతాయని, భవిష్యత్తులో YSRCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫిర్యాదులను పరిశీలించి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. “తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం” అని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం YSRCP నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని ఆరోపించారు. “రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారు. ఈ సాంప్రదాయం కొనసాగితే తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది” అని జగన్ హెచ్చరించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ను బాధాకరంగా అభివర్ణించారు. “మిథున్ రెడ్డికి రాష్ట్రంలోని ఆరోపణలతో ఏ సంబంధం లేదు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి ఆ శాఖను చూడలేదు. కేవలం వేధించాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టారు” అని ఆయన విమర్శించారు. అలాగే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చంద్రబాబు (CM Chandrababu) కంట్లో నలుసుగా భావించి అరెస్ట్ చేశారని, ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. నందిగం సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ లాంటి నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
YSRCP నాయకులు ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందునే వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని జగన్ తెలిపారు. “ప్రజల గొంతును నొక్కాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలనే కనిపించడం లేదు. సూపర్ సిక్స్ హామీలతో సహా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పాలనలో ఘోర వైఫల్యం చెందారు కాబట్టే ఈ తప్పుడు కేసులతో దృష్టి మళ్లిస్తున్నారు” అని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి రోజాపై తీవ్ర దుర్భాషలు, బీసీ మహిళ, జడ్పీ ఛైర్‌పర్సన్ హారికపై దాడులు, నల్లపరెడ్డిపై హత్యాయత్నం లక్ష్యంగా దాడులు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లలేని పరిస్థితి, సీఐ గన్ చూపి భయపెట్టే ప్రయత్నాలను జగన్ ఖండించారు. “కొంతమంది పోలీసు అధికారులు అవినీతిలో భాగస్వాములుగా మారారు. వారు కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కలెక్షన్లు పంచుతున్నారు. రాష్ట్రంలో వ్యవస్థీకృత అవినీతి జరుగుతోంది” అని ఆయన ఆరోపించారు.
YCP యాప్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా నమోదు చేసే అవకాశం కల్పించడం, భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీ ప్రజల పక్షాన నిలబడేందుకు సిద్ధంగా ఉందని జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ నిర్వహిస్తున్న ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలపై చర్చించారు.