Pelican Valley: తిరుపతిలో … పెలికాన్ వ్యాలీ!

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించేందుకు అమెరికాలోని ఐటీ, ఆర్థిక రంగాల నిపుణులు ముందుకొచ్చారు. రెండు దశాబ్దాల కిందట ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడిన సుమారు 20 మంది ప్రవాసులు రాష్ట్రంపై మమకారంతో ఇక్కడ ఐటీ పార్కు అభివృద్ధికి సిద్ధమయ్యారు. తొలుత సుమారు రూ.250 కోట్ల సొంత నిధులు వెచ్చించి తిరుపతి (Tirupati) జిల్లా దొరవారిసత్రం దగ్గర పెలికాన్ వ్యాలీ (Pelican Valley) ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 20 ఎకరాలు కొనుగోలు ఏశారు. 2026లో పనులు ప్రారంభించనున్నారు. పార్కు ఏర్పాటుకు అనుమతుల కోసం వివిధ విభాగాలకు దరఖాస్తులు చేసినట్లు ప్రాజెక్టు ఎండీ ఎంవీ రావు (MD MV Rao) వెల్లడించారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో వాక్ టు వర్క్ విధానంలో ఈ ఐటీ పార్కు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రెండు దశల్లో కలిపి 50 ఎకరాల్లో పార్కు అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ప్రాజెక్టు ప్రమోటర్ వాణి కూనిశెట్టి (Vani Kunisetty) తెలిపారు. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి దగ్గరలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నందున పెలికాన్ వ్యాలీగా పేరు పెట్టినట్లు తెలిపారు. ఆమె అమెరికాలోని ఎఫెక్‌సాఫ్ట్ కంపెనీ నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీలోని తెలుగు కళాసమితి కోశాధికారిగానూ వ్యవహరిస్తున్నారు.