Pawan Kalyan: నాదెండ్ల మనోహర్ ట్వీట్‌కు పవన్ స్పందన వైరల్..

ప్రభుత్వం ప్రజలకు ఏం అందించాలి అన్న ప్రశ్న ఎప్పుడూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంటుంది. ఉచిత పథకాలతో సంక్షేమ పాలన కొనసాగించాలా? లేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలా? అనే విషయంపై పాలకులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకులు తరచుగా వాదోపవాదాలు జరుపుతుంటారు. అయితే, ఈ సారి ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చిన సంఘటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మధ్య ఎక్స్ (X – Twitter) వేదికగా జరిగిన సంభాషణ.
పదహారు నెలలుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల పాలనలో మరింత చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నారు. మొదట్లో పరిపాలన వ్యవహారాల్లో అధికారుల సలహాపైనే ఆధారపడిన ఆయన, ఇప్పుడు అనుభవంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి విన్న సూచనలు, అభిప్రాయాలను ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పందన సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
నాదెండ్ల మనోహర్ ఇటీవల ఒక ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. అది 2018లో తిత్లీ తుఫాన్ (Titli Cyclone) సమయంలో శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో జరిగిన పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించినది. ఆ సమయంలో తుపాను బాధితులను పరామర్శించిన ఫోటోను పోస్ట్ చేస్తూ, పవన్‌తో కలిసి మొదలైన తమ రాజకీయ ప్రయాణం గురించి మనోహర్ భావోద్వేగంగా వివరించారు. క్లిష్టమైన సమయాల్లో పవన్ తనకు ఇచ్చిన ప్రేరణ, ధైర్యాన్ని గుర్తుచేశారు.
దీనికి పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేస్తూ తనదైన శైలిలో స్పందించారు. తుపాను బాధితులతో మాట్లాడిన రోజులు ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పారు. ప్రజలు ప్రభుత్వాలనుంచి ఉచితాలు కాదు, భవిష్యత్తు కోరుకుంటున్నారని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. “ప్రజలు ఎటువంటి ఉచిత పథకాలు కోరుకోవడం లేదు. వారు చెప్పింది ఒక్క మాట – మాకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలు వద్దు” అని పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో యువతపై నమ్మకం వ్యక్తం చేశారు. “మన యువతలో ఉన్న సామర్థ్యాన్ని మనం గుర్తించాలి. వారి కలలను నెరవేర్చే దిశగా మనం అడుగులు వేయాలి” అని అన్నారు. యువతతో నిరంతరం కలుస్తూ వారి ఆలోచనలను అర్థం చేసుకోవడమే తన ప్రధాన లక్ష్యమని పవన్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. చాలామంది ఆయన అభిప్రాయాన్ని సమర్థించగా, కొందరు మాత్రం సంక్షేమం , అభివృద్ధి రెండూ సమపాళ్లలో అవసరమని అంటున్నారు. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ దిశను, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.