విశాఖలో పర్యాటక పెట్టుబడుల సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏప్రిల్ 16వ తేదీన విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సును నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పర్యాటక రంగం ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అవంతి పాల్గొన్నారు. విశాఖపట్నంలోని హుడా చిల్డ్రన్స్ పార్కులో ఈ సదస్సు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులను సమీకరించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దాలన్నదే తమ అభిమతమని తెలిపారు. ఈ సదస్సుకు వివిధ రంగాల్లో నిష్టాతులైన వారిని ఆహ్వానించడంతో పాటు పెట్టుబడుదారులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చూడాలని మంత్రి పర్యాటక శాఖ అధికారులకు సూచించారు.






