Tiruvuru: చంద్రబాబుకి తలనొప్పిగా మారుతున్న తిరువూరు టీడీపీ నేతల రాజకీయాలు..
తిరువూరు (Tiruvuru) టీడీపీ శిబిరంలో జరుగుతున్న అంతర్గత వివాదం ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ముందున్న పెద్ద సవాలుగా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kollikapudi Srinivasa Rao) ,ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ ప్రతిష్టకు దెబ్బతీసే స్థాయికి చేరడంతో, వీరి మధ్య తేడాలను సరిచేయడం ఇప్పుడు చంద్రబాబుకు కత్తిమీద సాములా మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వివాదం బహిరంగంగా మారిన వెంటనే, పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరికీ నోటీసులు జారీ చేసి, పార్టీ క్రమశిక్షణ సంఘం (Disciplinary Committee) ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఇద్దరు నాయకులు కూడా ఆ ఆదేశాలను గౌరవించి, తమ వాదనలను సమర్పించారు. అయితే, ఎవరి తప్పు ఎక్కువ అనే విషయాన్ని స్పష్టంగా తేల్చడంలో కమిటీ తటపటాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఇద్దరి వివరాలను పార్టీ అధినేతకు అందజేసి, తుది నిర్ణయం ఆయనకే వదిలారని చెబుతున్నారు.
తిరువూరు నియోజకవర్గం (Constituency)లో కొలికపూడి శ్రీనివాసరావు ప్రవేశం కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆయనకు ఆ ప్రాంతంతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, పార్టీ వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి నుంచి పోటీ చేశారు. విజయాన్ని సాధించిన వెంటనే ఆయన తీరుపై కొంత అసంతృప్తి పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవల ఎంపీ కేశినేని చిన్ని పట్ల చేసిన విమర్శలతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
కొలికపూడి మాట్లాడుతూ తన నియోజకవర్గ కార్యక్రమాల్లో ఎంపీ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించగా, కేశినేని చిన్ని కూడా రోడ్డెక్కి ప్రత్యక్షంగా స్పందించారు. ఈ పరిణామాల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని క్రమశిక్షణ చర్యలకు గురిచేయాలన్నది ఆయనకు తలనొప్పిగా మారింది.
ఒకరిపై వేటు వేస్తే, మరొకరు విపక్షం వైసీపీ (YSRCP) వైపు వెళ్లే అవకాశం ఉందన్న ఆందోళనతో చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వైసీపీ పాలనలో రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju) వ్యవహారం ఎలా పార్టీకి ఇబ్బందిగా మారిందో గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు, ఈసారి ఎటువంటి తప్పిదం జరగకూడదని తేల్చుకున్నారు.
పార్టీ బలం దెబ్బతినకుండా, ఇద్దరి గౌరవం కాపాడుతూ, విభేదాలను పరిష్కరించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే నిర్ణయం ఆలస్యం అవుతోన్న కొద్దీ, తిరువూరులో టీడీపీ కార్యకర్తల్లో అయోమయం పెరుగుతోందని తెలుస్తోంది. చివరికి, చంద్రబాబు తీసుకునే నిర్ణయం తిరువూరు రాజకీయ సమీకరణాలనే కాకుండా, రాబోయే రోజుల్లో టీడీపీ లో అంతర్గత బలాన్ని కూడా నిర్ణయించబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.







