Bhogapuram: భోగాపురం ఎయిర్ పోర్టులో టెస్ట్ ఫ్లైట్ సక్సెస్.. టీడీపీ, వైసీపీ క్రెడిట్ వార్..!
విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఇక్కడి రన్‌వేపై దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్ తదితరులు ప్రయాణించారు.
అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయినట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని జూన్ 26న అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014-19 మధ్య ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ప్రణాళికలు రచించి, పనులు ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కొత్త మైలురాయి అని అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో వచ్చే జూన్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి, ఆయన దార్శనికతకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో విమాన రాకపోకలకు సంబంధించి నిర్వహించిన వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయి అని, విజన్ వైజాగ్ లక్ష్య సాధన దిశగా పడిన కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత దశకు చేరుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో వేసిన బలమైన పునాదే కారణమని ఆయన పేర్కొన్నారు.
“మా పాలనా కాలంలో ఈ ప్రాజెక్టుకు వేగవంతమైన అనుమతులు సాధించాం. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ప్రాజెక్టుకు పటిష్ఠమైన పునాది వేశాం. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషే ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకోవడానికి ముఖ్య కారణం” అని జగన్ వివరించారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్‌కు జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా, విశాఖపట్నం పోర్టును భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానించే బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.






