వైసీపీ పక్కా ప్లాన్..! టీడీపీ కీలక నేతలే టార్గెట్..?

తెలుగుదేశం పార్టీకి కష్టకాలం వెంటాడుతోంది. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి వరుస పరాభవాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ వరుసగా ఓటమి పాలవుతోంది. దీన్ని జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్న టీడీపీ నేతలకు ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. పార్టీ అధినేత మొదలు కింది స్థాయి కేడర్ వరకూ ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పార్టీ కేడర్ మొత్తం ఇబ్బంది పడుతోంది. మున్ముందు మరింత మంది నేతలపై కేసులు తప్పవనే అధికార పార్టీ నేతల హెచ్చరికలు ఇప్పుడు మరింత కంగారు పెట్టిస్తున్నాయి.
పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా టీడీపీలో పలువురు కీలక నేతలు అధికార పార్టీపై గళం విప్పుతున్నారు. దీంతో వారి నోళ్లు మూయించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందనేది టీడీపీ నేతల ఆరోపణ. ఏదో ఒక విధంగా భయపెట్టి వారిని అడ్డు తొలగించుకోవాలనుకుంటోందని టీడీపీ నేతలు చెప్తున్నారు. వివిధ రకాల కేసులు వారిపై పెట్టి జైలుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు కింది స్థాయి కేడర్ వరకూ చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వర రావు, ధూళిపాళ్ల నరేంద్ర, జెసీ ప్రభాకర్ రెడ్డి.. లాంటి అనేక మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడు అధికార పార్టీ ట్రెండ్ మార్చిందని చెప్తున్నారు. ఇన్నాళ్లూ టీడీపీ నేతలపై అక్రమాలు, ఆరోపణల అంశాలపై కేసులు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఎత్తుగడ వేసిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తాజాగా అమరరాజా కంపెనీలను మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీలు కాలుష్యం కలిగిస్తున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. తక్షణమే మూసివేయాలని ఆదేశించింది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ప్రస్తుత ఎంపీ గల్లా జయదేవ్ ఈ కంపెనీల ఓనర్లు. వీళ్లిద్దరూ టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
త్వరలోనే మరింత మంది టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ స్కెచ్ వేస్తోందని తెలుస్తోంది. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ ఆ పార్టీకి అండదండలు అందిస్తున్న పలువురు నేతలు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. బీద రవిచంద్ర యాదవ్, ఏలూరి సాంబశివరావు, నిమ్మల రామానాయుడు లాంటి నేతలు తదుపరి జాబితాలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నోరున్నోళ్లపైన, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లను టార్గెట్ చేయడం ద్వారా టీడీపీని వీక్ చేయొచ్చని అధికార పార్టీ భావిస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.