Nara Lokesh: చంద్రబాబు విజన్‌లో భాగంగా స్టీల్, డేటా, ఎనర్జీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి గట్టి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులు, పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని ఈ ప్రభుత్వం విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సింగపూర్ (Singapore) పర్యటనలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులతో సమావేశమై, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పెట్టుబడులు రప్పించేందుకు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి మూడు భారీ పరిశ్రమలు రావనున్నాయని తెలిపారు.
ఇప్పటికే ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని రూపొందించి, పరిశ్రమలకు తక్కువ సమయంలో అనుమతులు ఇవ్వడం, అవసరమైన మౌలిక వసతులు కల్పించడం వంటి చర్యలు తీసుకున్నారు. దీనివల్ల గత ఏడాది జూన్ నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దాదాపు పదిలక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నట్లు, దీంతో ఎనిమిది లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ సందర్బంగా మంత్రి లోకేశ్ మూడు ప్రధాన పరిశ్రమల ప్రస్తావన చేశారు. వాటిలో మొదటిది విశాఖపట్నం (Visakhapatnam) సమీపంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్. ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలవనుందని పేర్కొన్నారు. తన మిత్రుడు కరణ్ (Karan) సూచనతో ఇది జరుగుతుందని తెలిపారు. రెండవదిగా అనంతపురం (Anantapur)లో ఏర్పాటవుతున్న రెన్యూ పవర్ ప్లాంట్ (Renew Power Plant) గురించి వివరించారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ అవుతుందని అన్నారు. మూడవదిగా అనకాపల్లికి (Anakapalli) సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ (ArcelorMittal Steel Plant) ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆదిత్య మిట్టల్ (Aditya Mittal) కంపెనీ ప్రారంభించనున్న ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఆ ప్రాంత అభివృద్ధికి మేలు జరుగుతుందని చెప్పారు.
ఈ భారీ పరిశ్రమలు ఒక్క మంత్రుల ప్రైవేట్ ప్రాజెక్టులుగా కాకుండా, రాష్ట్రానికి మేలు చేసేవిగా భావిస్తున్నామన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేలా పరిశ్రమలు పనిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సన్‌రైజ్ స్టేట్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.