Chandrababu: వ్యవసాయానికి పనికిరాని భూముల్లో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు: చంద్రబాబు
చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి పనికిరాని బీడు, బంజరు భూములను పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించాలన్న ఆలోచన తో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు. విశాఖపట్నంలో (Visakhapatnam) జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షి సమ్మిట్ (CII Partnership Summit) సందర్భంగా రెన్యూ పవర్ (ReNew Power) తో ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రైతుల భూముల్లో సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే వారికి స్థిరమైన ఆదాయం వస్తుందని భావించిన చంద్రబాబు, ఒక ఎకరానికి ఎంత లాభం లభిస్తుందనే దానిపై రెన్యూ పవర్ చైర్మన్ , సీఈఓ సుమంత్ సిన్హా (Sumant Sinha)తో సమగ్రంగా చర్చించారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రముఖ సంస్థ అయిన రెన్యూ పవర్, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించడం ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రూ.82,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల అనుమతులను వేగంగా మంజూరు చేస్తోందని, పర్యావరణ హితం, తక్కువ ధరకు విద్యుత్ సరఫరా తమ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఇంధన రంగంలో ఇప్పటికీ ఏపీ ముందంజలో ఉందని ఆయన స్పష్టం చేశారు.
సుమంత్ సిన్హా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన రాష్ట్రమని, ముఖ్యంగా పునరుత్పాదక శక్తి రంగానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. విశాఖకు గూగుల్ (Google) డాటా సెంటర్ వస్తుండగా, భారీ విద్యుత్ అవసరాన్ని తీర్చడానికి రెన్యూ పవర్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఈ సంస్థ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి భారీగా పెట్టుబడులు పెట్టడం ముఖ్య పరిణామంగా భావిస్తున్నారు. ఇటీవల రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంఓయూలపై సంతకాలు చేసిన తర్వాత, పూర్వ ఒప్పందం రూ.22 వేల కోట్లు కలిపి మొత్తం పెట్టుబడి రూ.82 వేల కోట్లకు చేరింది. ఈ పెట్టుబడులతో 6 గిగావాట్ల ఇన్గాట్–వేఫర్ తయారీ యూనిట్, 2 గిగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 కేటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్, 5 గిగావాట్ల విండ్–సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు 10,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఇదిలా ఉండగా, అనంతపురం (Anantapur) జిల్లాలో 2.8 గిగావాట్ల హైబ్రిడ్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రెన్యూ పవర్ చర్యలు చేపట్టింది. ఇందులో సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు ఉంటాయి. ఈ భారీ పెట్టుబడులు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన శక్తిలో దేశానికి ఆదర్శంగా నిలపనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.






