Red Alert : శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా (Krishna) జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కాకినాడలో ఈ ఉదయం చిరుజల్లులు పడగా, ఉదయం 10 గంటల తర్వాత వర్షం తీవ్రత పెరిగింది. నేడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు (Nellore) జిల్లాల వరకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్(Red alert) జారీ చేశారు. రాయలసీమ (Rayalaseema) జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్లొద్దన్నారు. అన్ని పోర్టుల్లో(Port) ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపారు. తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.







