NDA Alliance: కూటమి ఐక్యతకు సవాలుగా మారుతున్న రఘురామరాజు, కొలికిపూడి వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అధికార టీడీపీ (TDP) పార్టీకి ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలే కొత్త తలనొప్పిగా మారారు. ఇటీవల ఉండి (Undi) ఎమ్మెల్యే , అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు (Raghurama Raju), అలాగే తిరువూరు (Tiruvuru) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kollikapudi Srinivasa Rao) చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి.
విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనలో రఘురామరాజు మాట్లాడుతూ భీమవరం (Bhimavaram) డీఎస్పీ జయసూర్య (Jayasurya) సమర్థుడని మెచ్చుకున్నారు. అయితే అతను చేసిన ఈ పని పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తీకరించేలా ఉంది . ఒక డిప్యూటీ సీఎంపై రఘురామరాజు చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి పార్టీ అగ్రనాయకులను ఆశ్చర్యపరిచింది. ఆయన మాటల ధోరణి కూటమిలో అసంతృప్తి రేపగా, మరుసటి రోజే తన వ్యాఖ్యలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే దాని ప్రభావం పార్టీ లోపల కనిపించిందని అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , పవన్ కళ్యాణ్ మధ్య సమన్వయం బలపడుతున్న సమయంలో రఘురామరాజు ఇలా మాట్లాడటం సరైన సంకేతం కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గోదావరి (Godavari) ప్రాంతానికి చెందిన రఘురామరాజు సహజంగా మాట్లాడే వ్యక్తి అయినప్పటికీ, ఆయన మాటల్లో వ్యంగ్యం కలిసిన తీరు అనేకమందిని ఇబ్బందికి గురిచేస్తోందని సహచర ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రతిపక్షాలపై పంచులు వేసేటప్పుడు ఆకట్టుకునే ఆయన బాణీ, ఇప్పుడు స్వపక్షంపైనా కనిపించడం వల్ల పార్టీలో అసహనం పెరుగుతోందట. ఈ అంశం పార్టీ నాయకత్వ దృష్టికి వెళ్లినా, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని అంటున్నారు. దీనివల్ల ఆయన వ్యాఖ్యలు మరింత ధైర్యంగా మారాయని కొందరు సూచిస్తున్నారు. ఇక మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీకి ఇబ్బంది కలిగించే మరో కారణంగా నిలిచారు. ఎన్నికల ముందు విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) కు తాను ఐదు కోట్లు ఇచ్చానని చెప్పడంతో రాజకీయాల్లో పెద్ద కలకలం సృష్టిస్తోంది. ఈ ఆరోపణలతో పార్టీ లోపల అసహనం పెరిగింది. అధికారంలోకి వచ్చిన రెండో రోజే వివాదం రేపిన కొలికపూడి, అనంతరం కూడా తన తీరు మార్చుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
పార్టీ కార్యకర్తలు, అధికారులు, మీడియాతో విభేదాలు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు అగ్రనాయకత్వంపై కూడా వ్యాఖ్యలు చేయడంతో అసంతృప్తి తీవ్రంగా వ్యక్తమవుతోంది. కొలికపూడి విషయంలో పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. గత 16 నెలలుగా టీడీపీ ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కున్నా, అధిష్టానం జోక్యంతో వారు సర్దుకుంటున్నారు. కానీ రఘురామరాజు, కొలికపూడి లాంటి నేతలు మాత్రం తమ స్వభావాన్ని మార్చుకోక పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి ప్రవర్తన ప్రభుత్వం ఇమేజ్‌పై ప్రభావం చూపుతోందని, క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.







