Praveen Pullata: ప్రమాదంలో 41 ఎమ్మెల్యేలు.. ప్రవీణ్ పుల్లట తాజా అంచనాలు..

ఏపీ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలలు పూర్తయింది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి సంక్షేమ కార్యక్రమాలు, పాలన పరంగా ముందుకు సాగుతోంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేల (MLAs) పనితీరుపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలను హెచ్చరించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తమ తీరులో మార్పు తేవాలని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ, కొందరి తమ పనితీరు మార్చుకోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ పుల్లట (Praveen Pullata) చేసిన తాజా ట్వీట్లు సంచలనంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ఘన విజయాన్ని ముందే అంచనా వేసిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా గణాంకాల ప్రకారం కనీసం 41 మంది కూటమి ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందకపోవచ్చు లేక గెలవలేరు అనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. అంతేకాదు కొంతమంది వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ముద్రపడుతున్నారని ఆయన అభిప్రాయం. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో మిశ్రమ అభిప్రాయం ఉంది. సంక్షేమ పథకాలు ఆశించిన వేగంలో అమలవ్వకపోవడం, పాలనలో సమర్థత కొరత వంటి అంశాలు ప్రభుత్వం పట్ల అసంతృప్తికి దారితీస్తున్నాయి. అయినప్పటికీ, పాలనకు ఇంకా సంవత్సరం కూడా పూర్తవ్వకపోవడంతో అది పెద్ద ఎత్తున వ్యతిరేకతగా మారలేదు. అయితే అభివృద్ధి లేకపోతే మాత్రం ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజల స్పందన మారే అవకాశముంది.
ఎన్నికల్లో తొలిసారి గెలిచిన 80 నుంచి 100 మంది మధ్య కొత్తవారు ఉన్నారు. వీరి తీరు కూడా పరిశీలనలో ఉంది. చంద్రబాబు (Chandrababu Naidu) ఇప్పటికే వర్క్‌షాప్‌లు (Workshops) నిర్వహించి ఎమ్మెల్యేలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు తమ పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ పుల్లట (Praveen Pullata) సర్వేల నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతవరకు స్పందిస్తారు అన్నదే కీలకంగా మారింది.