Pawan Kalyan: 96 ఏళ్ల పెద్దమ్మ తో కలిసి భోజనం చేసిన పవన్..

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసే ప్రతి పని ఓ ప్రత్యేకత ఉంటుంది అనే మాటకు మరోసారి న్యాయం జరిగింది. సినిమా స్టార్డం నుంచి రాజకీయ నాయకుడిగా మారినా, ఆయనలోని ఒరిజినాలిటీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. స్టైల్, మాటల బలంతోనే కాదు, మానవీయతతోనూ పవన్ తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మంగళగిరిలోని (Mangalagiri) క్యాంప్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఆయన మనసు ఎంత పెద్దదో చెప్పే ఉదాహరణగా మారింది.
96 ఏళ్ల వృద్ధురాలైన ఓ పెద్దమ్మ, తన పింఛన్ డబ్బులు కూడబెట్టి పవన్ గెలుపు కోసం మొక్కు తీర్చుకున్న విషయం తెలుసుకుని, ఆమెను స్వయంగా ఆహ్వానించి, అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం (Pitapuram Constituency) యు.కొత్తపల్లి మండలం (Kothapalli Madalam) కొత్త ఇసుకపల్లికి చెందిన ఈ వృద్ధురాలు, పవన్ విజయం కోసం వేగులమ్మ తల్లికి మొక్కుకున్నారు. “పవన్ గెలిస్తే అమ్మవారికి గరగ చేయిస్తాను” అని భావించి, తన నెలవారీ పింఛన్ నుండి రూ.2,500 చొప్పున కొద్దొకొద్దిగా దాచుకుంటూ చివరకు రూ.27,000 కూడబెట్టి మొక్కు తీర్చారు.
ఇది తెలిసిన పవన్ ఆమె గురించి ఆరా తీయగా.. పవన్ కళ్యాణ్ తో కలిసి భోజనం చేయాలన్న కోరిక ఆమెకు ఉన్నట్లు తెలుసుకున్నాడు. దీంతో ఆమెను తన ఇంటికే పిలిపించి, నులక మంచం మీద కూర్చోబెట్టి స్వయంగా భోజనం వడ్డించి ఆమెతో భోజనం చేశారు. అనంతరం ఆమెకు చీరతో పాటు రూ.1 లక్ష నగదు బహూకరించి, ప్రేమతో వీడ్కోలు పలికారు.
సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో నాయకులు మాటలకే పరిమితమవుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం తన అభిమానులను కేవలం ఓటర్లుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావిస్తూన్నారు. ఓ వృద్ధురాలికి చేసిన ఈ ఆతిథ్యం చూసిన ప్రజలు, నెటిజన్లు పవన్‌పై మళ్లీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సంఘటన పవన్ నిజంగా ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారో, ఆయన విజయానికి వెనుక ఉన్న కారణాల్లో ప్రజల నమ్మకం ఎంత గొప్పదో చూపిస్తుంది. రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రజల మన్ననలు అందుకోవడమే కాకుండా, మానవత్వాన్ని ఆచరణలో చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు.