Chandrababu: విద్వేషం కాదు, సమన్వయమే మార్గం..నీళ్ల రాజకీయాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పరిపక్వత
తెలుగు రాష్ట్రాల విషయంలో “కలిసి ఉంటే కలదు సుఖం” అనే మాటను రాజకీయంగా వక్రీకరించడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణ (Telangana) అంశం వచ్చేసరికి ఇలాంటి మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని చిత్రీకరించడం పరిపాటిగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే “రాష్ట్రాలుగా విడిపోదాం, కానీ తెలుగువారిగా కలిసి ఉందాం” అనే నినాదం బలంగా వినిపించింది. అప్పుడు ఆ మాటలను స్వాగతించినవారే, ఇప్పుడు రాజకీయ లాభాల కోసం వాటినే అనుమానాస్పదంగా చూపించడం ప్రశ్నార్థకంగా మారింది.
రాజకీయ స్వార్థం కోసం విద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల కొందరికి పదవులు దక్కవచ్చు గానీ, కోట్లాది మంది ప్రజలకు మాత్రం సమస్యలే మిగులుతాయి. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగిన అన్యాయాలే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పాత గొడవలనే కొనసాగించడం కంటే, రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ అధికార, విపక్ష పార్టీలన్నీ కూడా ఏపీ (Andhra Pradesh) వ్యతిరేకతనే రాజకీయ ఆయుధంగా మార్చుకున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల మళ్లీ నీటి అంశం రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా రాజకీయంగా గట్టిగానే స్పందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీసుకున్న వైఖరి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.
నీళ్లపై రాజకీయాలు చేయొద్దని, పరస్పరంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. గోదావరి (Godavari) నదిలో అపారమైన నీరు ఉందని, వాటా కోసం గొడవపడటం కన్నా చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని సూచించారు. గతంలో తెలంగాణ ప్రయోజనాల కోసం దేవాదుల (Devadula) ప్రాజెక్ట్ విస్తరణకు ఏపీ అడ్డుకోలేదని, కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్ట్ విషయంలో కూడా అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు పోలవరం (Polavaram), నల్లమల సాగర్ (Nallamala Sagar) అంశాలపై రాజకీయ రగడ ఎందుకని ప్రశ్నించారు.
భావోద్వేగాలతో కాకుండా, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. సముద్రంలో కలిసే నీటిని వినియోగించుకోవడం సహజమే అయితే, దానిపై అభ్యంతరాలు ఎందుకన్నది ఆయన వాదన. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయాలి గానీ, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్న సందేశాన్ని చంద్రబాబు తన మాటలతో చెప్పకనే చెప్పారు.
దీంతో ఇప్పుడు… తెలంగాణలో కేసీఆర్ (KCR) అనుసరించిన భావోద్వేగ రాజకీయాల మార్గాన్నే కొనసాగించాలా? లేక పరిపక్వతతో కూడిన చంద్రబాబు దృక్పథాన్ని అనుసరించాలా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు రాజకీయ నేతలకంటే నిపుణులు, మేధావులతో కూడిన స్వతంత్ర కమిటీలు అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర అభివృద్ధితో మరో రాష్ట్రానికి నష్టం జరిగితే, దానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించడమే సరైన మార్గం. విద్వేష రాజకీయాలకు ముగింపు పలికితేనే, రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు సురక్షితంగా, సమృద్ధిగా ముందుకు సాగుతుంది.






