Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేశ్!
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో (NDA) తెలుగుదేశం పార్టీ (TDP) కీలక భాగస్వామి అనే విషయం తెలిసిందే. కూటమిలో బీజేపీ (BJP) తర్వాత అత్యధిక సీట్లు కలిగిన పార్టీ టీడీపీయే. కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ లేకపోవడంతో భాగస్వామ్యపక్షాలపై ఆధారపడి ఉంది. టీడీపీ ఇందులో ప్రధాన భూమిక పోషిస్తోంది. అయితే ఎన్డీయేలో మరింత కీలక భూమిక పోషించేందుకు టీడీపీ ఈ మధ్యకాలంలో ఉత్సాహం చూపిస్తోంది. అందులో భాగంగా బీహార్ ఎన్నికల (Bihar Elections) ప్రచారానికి కూడా టీడీపీ వెళ్తోంది. ఆ పార్టీ యువనేత, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఇవాళ బీహార్ వెళ్తున్నారు.
ఎన్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్నా కూడా టీడీపీ ఎక్కడా భేషజాలకు పోవట్లేదు. బీజేపీతో సఖ్యతగా మెలుగుతూ ఆ పార్టీకి అడుగడుగునా అండగా నిలుస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ కోరిన ప్రతి చోటికీ వెళ్లి ప్రచారం చేస్తోంది. గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు బీహార్ లో కూడా టీడీపీ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ తరపున ఈసారి చంద్రబాబు కాకుండా లోకేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. పబ్లిక్ మీటింగ్స్ కాకుండా ఇండస్ట్రియలిస్టులతో లోకేశ్ సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేశ్.. మధ్యాహ్నం బీహార్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. సాయంత్రం పాట్నా చేరుకుంటారు. అనంతరం ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారం చేపడతారు. సాయంత్రం బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, బీహార్ పారిశ్రామికవేత్తలతో నారా లోకేశ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రేపు ఉదయం పాట్నాలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. రేపు సాయంత్రం విజయవాడకు తిరిగి చేరుకుంటారు. పబ్లిక్ మీటింగ్స్ కాకుండా ఈసారి ఓటర్లను ప్రభావతం చేయగల కమ్యూనిటీతో లోకేశ్ ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం.
ఇటీవలికాలంలో ఎన్డీయే కీలక సమావేశాలకు లోకేశ్ తరచుగా హాజరవుతున్నారు. టీడీపీ భవిష్యత్ నేతగా లోకేశ్ ఎదుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే చంద్రబాబు కూడా లోకేశ్ కు యాక్టివ్ రోల్ పోషించేలా ప్లాట్ ఫాం రెడీ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రధాని మోడీ కూడా లోకేశ్ ను ఢిల్లీ పిలిపించుకుని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అటు బీజేపీకి, ఇటు టీడీపీకి వీళ్లిద్దరి భాగస్వామ్యం ఎంతో మేలు చేస్తుంది. అందుకే రెండు పార్టీలు పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో టీడీపీ మరింత కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.







